అనేక అనారోగ్యాలను పారదోలే సొరకాయ
గుడ్‌ఫుడ్
ఆరోగ్యానికి సొరకాయతో ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి ఇది కాపాడుతుంది. సొరకాయ ఉపయోగాల్లో కొన్ని...
►100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే.
► సొరకాయలో 96 శాతం నీరే. ఇక అందులో విటమిన్–సి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. కాబట్టి చెమట రూపంలో నీరు, ఖనిజ లవణాలను కోల్పోయే వృత్తుల్లో ఉండేవారు సొరకాయ తినడం చాలా మంచిది. తరచూ అలసటగా ఉండేవారు సొరకాయ తింటే త్వరగా శక్తి సమకూరుతుంది.
►100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
►సొరకాయలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారించడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కిందినుంచి గ్యాస్ ఎక్కువగా పోయే వారు, పైల్స్‌తో బాధపడేవారు సొరకాయ తినడం మంచిది.
►బరువు తగ్గాలనుకునేవారికి సొరకాయ మంచి కూర. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది.
► సొరకాయలో సోడియం, పొటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువ. పొటాషియమ్ బీపీని నియంత్రిస్తుంది. కాబట్టి హైబీపీతో బాధపడేవారు సొరకాయ తింటే మేలు.
►సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.