మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి (69) ఆదివారం తిరిగి విధుల్లో చేరారు. అనారోగ్యం కారణంగా గత 40 రోజులుగా డాలర్ శేషాద్రి ఆసుపత్రికే పరిమితమయ్యారు. కిడ్నీలకు వైద్యం చేయించుకుని తిరిగి స్వామివారి సేవకు వచ్చానని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు స్వామి వారి సేవలోనే తరిస్తానని పేర్కొన్నారు.
1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశారు. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత స్వామి వారి ఆలయ ఓఎస్‌డీగా అవకాశం వచ్చింది.పదవీ విరమణ తర్వాత కూడా సుమారు తొమ్మిదేళ్లుగా శ్రీవారి సేవలో నిమగ్నమైన శేషాద్రికి ఇదివరకే పలుమార్లు ఛాతీనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.