శ్రీవారి డాలర్ల కుంభకోణం కేసులో తీర్పు
- టీటీడీ మాజీ ఉద్యోగికి మూడేళ్ల జైలు
చిత్తూరు/సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన బంగారు డాలర్లను మాయంచేసిన కేసులో టీటీడీ మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు సీబీసీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ఆలయ మాజీ షరాబు వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ శుక్రవారం తీర్పునిచ్చారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లెపాగు శ్రీనాథ్ కథనం మేరకు.. 2006 జూన్ 22న శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్‌లో 5 గ్రాముల బరువున్న 300 శ్రీవారి డాలర్లు కనిపించకుండా పోయాయి. దీన్ని గుర్తించిన అప్పటి ఆలయ పేష్కార్ వాసుదేవన్ రూ.15 లక్షల విలువైన బంగారు డాలర్లు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. డాలర్లు కనిపించకుండా పోయిన కాలంలో షరాబుగా పనిచేసిన వెంకటాచలపతే ఈ చోరీకి కారణమని సీబీసీఐడీ పోలీసులు నిర్ధారించారు.
న్యాయం గెలిచింది: డాలర్ శేషాద్రి
డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘న్యాయం గెలిచింది. డాలర్ల కేసుతో నాకు సంబంధం లేదని చెప్పాను. అదే జరిగింది. అంతా ఆ స్వామి దయ’’ అని పేర్కొన్నారు.