
శ్రీవేంకటేశ్వర స్వామి కొలువులో అజరామరమైన సేవలో తరించిన వారెందరో. వారిలో డాలర్ శేషాద్రి స్వామి అద్వితీయుడు. 1978 నుండి నాకున్న పరి చయం మధ్యాహ్నపు నీడలా అంతకంతకూ పెరిగింది. విశేషించి నేను పాలకమండలి అధ్యక్షుడిగా దేవదేవుడికి చేసిన కైంకర్యంలో శేషాద్రి స్వామి సహకారం వెలలేనిది. వ్యక్తిగతంగా అందరివాడు శేషాద్రి – నిగర్వి, సౌమ్యుడు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. ఎంతటి వారినైనా ఆదరిస్తారు, అవసరమైతే అదుపు చేస్తారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనా కాలంలో నా నేతృత్వంలో (కళ్యాణమస్తు), దళిత గోవిందం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహిం చాము. ప్రతి కార్యక్రమంలో తలలో నాలుకలా శ్రీనివాసుని ధర్మప్రచారంలో నాకు ఆయన తోడై నిలిచారు. శేషాద్రి స్వామి అంటే సమయపాలనకు ఉదాహరణ. ఒక సమయానికి ఈ పని జరగాలని, నిర్ణయిస్తే, సకాలంలో దీన్ని పూర్తి చేయడంలో సహకరిస్తాడు. సేవలలో, కార్యక్రమాలలో ఎలాంటి చిన్న లోపం జరగకుండా తగిన జాగరూకత వహిస్తాడు.
ప్రతీ వ్యక్తి జీవితంలో చీకటి, వెలుగులుంటాయి. తిరుమలలో జరిగిన డాలర్ల వినియోగంలో అవకతవకల్లో ఈయన హస్తముందన్నారు. కానీ, సమగ్ర విచారణ జరిగాక, స్వచ్చంగా పులుకడిగిన ముత్యంలా నిలి చారు. నాకు తెలిసినంతవరకూ ఏనాడు కూడా ధనానికి శేషాద్రి స్వామి ప్రాధాన్యతను ఇవ్వలేదు. పైగా శ్రీవారి భక్తులు బలవంతంగా సంభావనను ఇచ్చినా, సాటి వారికి వితరణ చేసేవారు లేదా శ్రీవారి సేవల్లో ఏ అలంకారానికో ఖర్చు చేసేవారు.
చదవండి: (శ్రీవారి సేవలో 43 ఏళ్లు)
తిరుమల ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ అన్నమయ్య కీర్తనలో – ఎండకానీ, వాన కానీ, ఏమైనా కానీ, కొండలరాయుడే కులదైవ మన్న సందేశాన్ని స్వామి స్ఫూర్తిగా నింపుకొన్నవారీ యన. సంప్రదాయ దుస్తులతో, ఊర్థ్వపుండ్రాలతో నిత్యం శ్రీవారి సేవలో తరించేవారికి ఆయన స్ఫూర్తిదాత. తిరుమలకు వచ్చిన భారత రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులెందరెందరో శేషాద్రి స్వామితో తప్పకుండా ఫోటోకు సిద్ధమవుతారు. ఇది అతిశయోక్తి కాదు. నేను తిరుపతి వాసిగా, స్థానిక శాసనసభ్యుడిగా, పాలకమండలి అధ్యక్షుడుగా పలు పదవులు పొందుతుంటే ఇంటికివచ్చి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మనస్వి.
చదవండి: (డాలర్ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం)
అన్నింటికీ మించి శేషాద్రి స్వామిలో నేను గమనించిన గొప్పలక్షణం, నిరాడంబరత. ఏనాడూ, ఎవరినీ ఆయన కించిపరచి మాట్లాడరు. మనిషికీ, మనిషికి మధ్య అంతరం తొలగాలని కోరుకొనేవారు. శ్రీవారి పక్షాన ఎన్నో దేవాలయాలకు వెళ్ళి వస్త్ర బహుమానాలిచ్చే కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యశీలి. అసలు ఉత్సవ సమయాల్లో ప్రతి చోటా తాను ఉండటమే కాకుండా, స్వామి కైంకర్యంలో శాస్త్రీయతకు బాసటగా నిలుస్తారు. విశ్రాంతి సమయాలను పాటించకున్నా, ఆరోగ్యంగా తనవంతు సేవలు చక్కగా చేశారు. ఇందుకు కారణం సమయపాలన, నిబద్ధత, శ్రీవారి పట్ల ఉన్న విశేష భక్తి విశ్వాసాలు. ఉదాత్త భావాలు కలిగిన శ్రీవారి దాసుడు. నిజాయితీ కల ఉద్యోగి, ఏ పటాటోపాలు లేని ఆచార్య పురుషుడు. సదా శ్రీవారి సేవల్లో జీవితాన్ని పండించుకొన్న ధన్యజీవికి, నా కన్నీటి వీడ్కోలు. శ్రీనివాస ప్రభువు శాశ్వత వైకుంఠవాసాన్ని శేషాద్రి స్వామికి ప్రసాదిస్తాడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
భూమన కరుణాకరరెడ్డి
వ్యాసకర్త తిరుపతి శాసనసభ్యులు