తుది శ్వాస వరకూ స్వామి సేవలోనే: డాలర్ శేషాద్రి
తిరుపతి : డాలర్ల కుంభకోణం కేసులో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని డాలర్ శేషాద్రి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికించేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. స్వామివారి ఆశీస్సులు ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని డాలర్ శేషాద్రి అన్నారు. తుది శ్వాస ఉన్నంత వరకూ స్వామివారి సేవలోనే తరలించాలనేది తన కోరిక అని ఆయన పేర్కొన్నారు.
కాగా తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ మేరకు చిత్తూరు కోర్టు తుదితీర్పునిచ్చింది. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.