పది రోజుల తర్వాత మళ్లీ వస్తా
వైద్యుల సూచన మేరకే ఉత్సవాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది
స్వామి సేవకే అంకితం : డాలర్ శేషాద్రి
తిరుమల : ‘నా తుది శ్వాస వరకు స్వామి సేవకే అంకితం. ఆ స్వామి దయ ఉన్నంత వరకూ నా సంకల్పంలో ఎలాంటి రాజీ ఉండబోదు’ అంటున్నారు ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన వైద్యుల సూచన మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొంత దూరంగా ఉంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన్ను సోమవారం ఫోన్‌లో ‘సాక్షి’ పలకరించింది.. ఆయన మాటల్లోనే.. ‘నాకు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలంటే ప్రాణం.
కొండకి రావాలనీ ఉంది. కానీ.. వైద్యులు వారిస్తున్నారు. మరో పదిరోజుల తర్వాతే పంపుతామంటున్నారు. ఏమి చేసేది. వయసు మీద పడుతోంది కదా?. వారి చెప్పినట్టు వినకతప్పడం లేదు. 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరాను. వివిధ హోదాల్లో పనిచేశాను. 32 ఏళ్ల కాలంలో 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశాను. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశాను.
ఆ తర్వాత ఆస్వామి వారే ఆలయ ఓఎస్‌డీగా కొనసాగేలా అవకాశం ఇచ్చారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు స్వామి సేవ చేస్తాను. అదే సంకల్పంతో సాగిపోతున్నా. ఇప్పటికే నా ఉద్యోగ జీవితంలో 60కిపైగా బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకున్నా. యేటా బ్రహ్మోత్సవాలతోపాటు అధికమాసంలో వచ్చే రెండు బ్రహ్మోత్సవాలూ ఉన్నాయి. దేనికవే సాటి. ఆయా సందర్భాల్లో అందరూ కలసికట్టుగా పనిచేయడం దేవస్థానంలోని మంచి సంప్రదాయం. ఆరోగ్య కారణాల రీత్యా అంతకుమించి మాట్లాడలేను’ అంటూ సెలవిచ్చారు.