బైక్‌పై తిరిగితే నడుంనొప్పి వస్తుందా? | Pain turn out to get on the bike? | Sakshi
Sakshi News home page

బైక్‌పై తిరిగితే నడుంనొప్పి వస్తుందా?

Published Thu, Jul 14 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

Pain turn out to get on the bike?

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 40 ఏళ్లు. బరువు 80 కేజీలు. ఉద్యోగరీత్యా రోజూ దాదాపు 60 కి.మీ. పైగా ద్విచక్రవాహనం నడుపుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. దయచేసి పరిష్కార మార్గాలు చెప్పండి. - రేవతి, ఏలూరు
నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, పోషకాహార లోపం, తగినంత నిద్రలేకపోవడం, మానసిక ఆందోళన, మీలా బైక్‌పై ఎక్కువగా తిరుగుతుండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ ఇదే పొడవైనది. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 - 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువ.

కారణాలు:  ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది   దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది  గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది  శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు.

లక్షణాలు:  కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం   కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం  రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం  బరు వులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ పరీక్షలు: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై
 
చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది.
 
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)  స్టార్ హోమియోపతి హైదరాబాద్
 
 
పాప పాలిపోతోంది... పరిష్కారం?
హెమటాలజీ కౌన్సెలింగ్

మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుంచి నెలనెలా తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్ల్పీన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతున్నాం. నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక కేవలం నెలన్నర అయిందంటే చాలు... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? - ఒక సోదరి, విశాఖపట్నం
సాధారణంగా మన రక్తంలోని ఎర్రరక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లల్లా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్ప్లీన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్ర రక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్ర రక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూల వనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతో కొంత సమర్థంగా ఉంటాయి.

ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు తొలగిపోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం.

ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం కాస్త దురదృష్టమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది.

 
తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100-150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. అందుకే ఆ మాత్రలు తప్పనిసరి.
 
నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి రక్తవ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి.
 
డా॥శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో
ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ
హాస్సిటల్స్, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement