కనీసం ఒక్కరోజైనా కసరత్తులపై దృష్టి
వారాంతాల్లో బిజీ.. బిజీగా జిమ్ములు
స్లాట్స్ కోసం నగర యువత ఎదురుచూపులు
సమాన ప్రయోజనాలు పొందుతున్నారని నివేదికలు
నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్న నగర యువత వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారానికి ఒక్కరోజైనా కసరత్తులు చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నారని నగర వాసులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు రెగ్యులర్‌గా జిమ్ చేసే వారితో సమానంగా ఫలితాలను పొందుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సెలవు రోజుల్లో అవకాశాన్ని బట్టి జిమ్‌కు
వెళ్లడం, క్రీడల పట్ల నగర యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మానసిక ప్రశాంతతో పాటు, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు. పనిదినాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, రాత్రి 7 గంటల తరువాత జిమ్ టైమింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. దీంతో ఆ సమయంలో బిజీబిజీగా మారుతున్నాయి. దీంతో స్లాట్స్ దొరకడం కష్టంగా ఉందని చెబుతున్నారు. సెలవు రోజుల్లో జిమ్‌కు వచ్చే వారి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ సమయం జిమ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
సర్వేలు చెప్పేదేంటి!..
ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వారంలో ఒక్క రోజైనా వ్యాయామం చేసే వారి చేతికి యాక్సిలరో మీటర్ అమర్చి సుమారు 90 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషిచింది. ఈ నివేదికల ప్రకారం దాదాపు నిత్యం వ్యాయామం చేసిన వారితో సమానంగా వారంలో ఒక్క రోజైనా కనీసం రెండున్నర గంటల నుంచి 3 గంటల పాటు వ్యాయామం చేసేవారు సమాన ప్రయోజనాలు పొందుతున్నారని తేలింది.
వారంలో గంటన్నర కంటే తక్కువ వ్యాయామం చేసిన వారిలో జీర్ణకోశ, నాడీ వ్యవస్థ, మానసిక రోగాలు వంటివి మొత్తం 678 రోగాలను గుర్తించారు. అదే సమయంలో నిత్యం వ్యాయామం చేసేవారు, వారంలో వీలు చూసుకుని ఒక్క రోజైనా రెండున్నర గంటలకుపైగా వ్యాయామం చేసే వారిలో సుమారు 200 రకాల రోగాలు తక్కువగా ఉన్నాయని తేలింది. వ్యాయామం చేసిన వారిలో అధిక రక్తపోటు సమస్య 23 శాతం నుంచి 28 శాతం తక్కువగా ఉంటే, మధమేహం మాత్రం 43 శాతం నుంచి 48 శాతం తక్కువగా వస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
షిఫ్ట్ డ్యూటీలతో ఇబ్బంది..
డ్యూటీలో షిఫ్ట్‌ల సిస్టం ఉంటుంది. నైట్ షిఫ్ట్ ఉంటే పగలంతా నిద్రపోవడం వల్ల జిమ్‌కు వెళ్లడం కుదరడం లేదు. ఇటువంటి
సందర్భంలో సెలవు రోజుల్లో స్లాట్ బుక్ చేసుకుంటాను. కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు వర్కౌట్ చేస్తాను. సాధారణ షిఫ్ట్‌లు ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం సమయంలో రోజుకు ఒక గంట సమయం జిమ్ కోసం కేటాయిస్తాను.
– శిరీష, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
సెలవు రోజుల్లో స్లాట్స్‌కు డిమాండ్ ..
సెలవు రోజుల్లో ఎక్కువ మంది జిమ్‌కు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం స్లాట్స్ బిజీగా ఉంటాయి. అటువంటి సమయంలో జిమ్ ట్రైనర్‌గా ఎక్కువ మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో అంతగా ఫ్లోటింగ్ ఉండదు. అటువంటి సమయంలో సహచర సిబ్బంది జిమ్‌ను మేనేజ్ చేసుకోగలుగుతారు. నేను రెండు గంటలకు తగ్గకుండా జిమ్ చేస్తాను. జిమ్ చేయడంపై మక్కువతో విడిచిపెట్ట లేకపోతున్నా. ఉద్యోగం, జిమ్ రెండింటినీ మేనేజ్ చేస్తున్నాను.
– రాహుల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, జిమ్ ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment