లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి | Sakshi Editorial On Tuberculosis Health Problem | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి

Published Fri, Nov 8 2024 5:15 AM | Last Updated on Fri, Nov 8 2024 5:15 AM

Sakshi Editorial On Tuberculosis Health Problem

కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ – ఎండీఆర్‌ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. 

ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. 

గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 

2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. 

నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. 

అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. 

ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. 

టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్‌’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. 

అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్‌–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.

ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. 

అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement