tuberculosis (TB)
-
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
బై బై టీబీ.. కోవిడ్ తరహాలో క్షయ వ్యాధి నియంత్రణ
సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది. కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలోనే ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు. దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది. త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. 93 శాతం సక్సెస్ రేటు దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది. గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు. త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
రాష్ట్రంపై క్షయ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అధిక కేసులు నమోదు అవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, పాలకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని క్షయ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2022లో టీబీ కారణంగా ఏకంగా 1,892 మంది మరణించారు. 2021లో 2,055 మంది, 2020లో 2,300 మంది చనిపోయారు. 2022లో 72,911 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడం లేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో 52,269 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,243 మందికి, 2021లో 60,796 మందికి వ్యాధి సోకింది. 2022లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఏకంగా 72,911 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం. 2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 86.5 శాతం మందికి ఆర్థిక సాయం... నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్దతిలో క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో కొందరు క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. వారికి బలవర్థకమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతం కంటే ఇది కాస్త మెరుగుపడిందని రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారులు అంటున్నారు. 2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అందింది. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి మాత్రమే ఆర్థికసాయం అందింది. మిగిలిన వారికి రాలేదని అధికారులు చెబుతున్నారు -
క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం
సాక్షి, విశాఖపట్నం: క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విశాఖ జిల్లా బాధితులకు సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.16.80 లక్షలను విరాళంగా అందజేసింది. ఆరు నెలలపాటు 400 మంది రోగులకు ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి సంస్థ ఎండీ కె.నిత్యానందరెడ్డి తరఫున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు సోమవారం అందజేశారు. ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం అందించేందుకు రూ.4,200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో విశాఖపట్నం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
2025 నాటికి టీబీ సమూల నిర్మూలన: మైల్యాబ్ కీలక ఆవిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలోఉన్న మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్.. క్షయ వ్యాధిని గుర్తించేందుకు పాథోడిటెక్ట్ పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్‌ను రూపొందించింది. క్షయ చికిత్సలో వాడే రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్ ఔషధాలు రోగిపై ఏ మేరకు పనిచేస్తాయో కూడా ఒకే పరీక్షలో తెలుసుకోవచ్చు. ఈ కిట్‌కు సీడీఎస్‌సీవో, టీబీ ఎక్స్పర్ట్ కమిటీ, ఐసీఎంఆర్ ఆమోదం ఉందని కంపెనీ తెలిపింది. క్షయవ్యాధికి సంబంధించి ఒకే పరీక్షలో రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్‌లకు బహుళ ఔషధ నిరోధకతనుగుర్తించే మేడ్ ఇన్ ఇండియా టీబీ డిటెక్షన్ కిట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ కిట్‌కు అనుమతినిచ్చినట్టు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో TB నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాలంలో రెండు సమస్యల్ని పరిష్కరిస్తున్నామని మైల్యాబ్ ఎండీ హస్ముఖ్ రావల్ తెలిపారు.దేశంలో 2025 నాటికి టీబీనీ సమూలంగా నిర్మూలించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. -
TB Deaths: రాష్ట్రంపై క్షయ పంజా.. ఐదు నెలల్లోనే 798 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. నాలుగైదు ఏళ్లుగా తెలంగాణలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు టీబీ కారణంగా 798 మంది మరణించారు. గతేడాది (2021) 1,876 మంది చనిపోయారు. క్షయ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 15వ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇదేకాలంలో అత్యధికంగా 6,896 మంది మరణించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 2,845 మంది, గుజరాత్లో 2,675 మంది, మధ్యప్రదేశ్‌లో 2,450 మంది మరణించారు. రాష్ట్రంలో ఏడు నెలల్లో 33,907 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడంలేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తించగా 2018లో 52,269 మందికి వ్యాధి సోకింది. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,209, 2021లో 60,714 మందికి వ్యాధి సోకింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు అంటే దాదాపు ఏడు నెలల్లో 33,907 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. ఈ ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ఈ కాలంలో ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021 జనవరి–సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో టీబీ రోగులకు చికిత్స అందించగా 89 శాతం మంది నయమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విశ్లేషించింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా సక్సెస్ రేటు 97 శాతం ఉండగా జనగామ జిల్లాలో అత్యంత తక్కువగా 79 శాతమే ఉందని తెలిపింది. అదే కాలంలో 1,592 మంది వ్యాధి తగ్గక మరణించగా 192 మందికి చికిత్స విఫలమైందని పేర్కొంది. 28 మంది రోగులు వైద్యానికి నిరాకరించారని వివరించింది. ఆర్థిక సాయం 67 శాతం మందికే... క్షయ వ్యాధిగ్రస్తులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 500 అందిస్తోంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో అనేక మంది క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. దీంతో అనేక మంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు 67 శాతం మందికి అంటే 22,795 మంది క్షయ రోగులకు ఆర్థిక సాయం అందగా మిగిలిన వారికి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఆదిలాబాద్‌లోని క్షయ రోగులకు అత్యధికంగా 91 శాతం మందికి ఆర్థిక సాయం అందింది. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లా బాధితులు 49 శాతమే సాయం పొందారు. జనగామ జిల్లాలో 52 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 56 శాతం, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో 55 శాతం, కామారెడ్డి జిల్లాలో 57 శాతం చొప్పున ఆర్థిక సాయం అందింది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, చికిత్సపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని వైద్య నిపుణులంటున్నారు. -
టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్ఐఆర్టీ డైరెక్టర్ పద్మా ప్రియదర్శిని చెప్పారు. అయితే, చికిత్స పూర్తి చేసుకున్న బాధితుల ఆయుర్దాయం రేటు ఆందోళనకరంగానే ఉంటోందని అన్నారు. మిగతా వారితో పోలిస్తే టీబీ వ్యాధి బాధితుల్లో అకాల మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాతి సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. బాధితుల్లో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణయిందన్నారు. -
వివక్ష కాదు వైద్యం కావాలి
భారతదేశంలో ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరు క్షయ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం. వైద్యంలో నిర్లక్ష్యం. వ్యాధి వచ్చిందని తెలిస్తే వివక్ష. దానిని సాకుగా తీసుకుని వదిలిపెట్టే భర్తలు, గదిలో పెట్టే కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకండి. వెంటనే వైద్యం చేయించండి. ఇది జరిగింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. మరో పదిరోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయికి టీబీ బయటపడింది. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెట్టాలని, ఆరునెలలు తప్పనిసరిగా నాగా పడకుండా మందులు వాడాలని చెప్పారు. దాంతో ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆమెకు టి.బి. అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లయినా ఆ మందులు అందరి ముందు వాడితే జబ్బు సంగతి బయటపడుతుంది. పెళ్లి ఆగడానికి లేదు. అలాగని ముందుకు వెళ్లడానికీ లేదు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే– మందులు సక్రమంగా వాడితే హాయిగా మునుపటి జీవితం గడపవచ్చు అని. అమ్మాయి ధైర్యం చేసింది. పెళ్లి చేసుకుంది. కాని ఆరు నెలల పాటు ఏదో వ్రతం చేసినట్టుగా ఎంతో జాగ్రత్తగా అత్తమామల దృష్టి భర్త దృష్టి పడకుండా మందులు వాడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యవంతురాలైంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇదే పని అత్తమామల ఆదరంతో కూడా చేయవచ్చు. అలాంటి ఆదరం మగవాడికి దొరికినట్టుగా స్త్రీకి దొరకదు. అదే ఈ జబ్బులో ఉన్న అనాది వివక్ష. 2020లో మన దేశంలో పదిహేను లక్షల మంది టీబీతో మరణించారు. వీరిలో 5 శాతం మంది స్త్రీలు. వీరంతా 30 నుంచి 69 మధ్య వయసు ఉన్నవారు. అంతే దాదాపుగా గృహిణులు, తల్లులు, అమ్మమ్మలు, అవ్వలు. వీరు ఈ మరణాలకు ఎలా చేరుకుని ఉంటారు. తెలియనితనం వల్ల, కుటుంబ నిర్లక్ష్యం వల్ల, ఒకవేళ జబ్బు సంగతి తెలిస్తే సక్రమంగా మందులు తెచ్చివ్వకపోవడం వల్ల, కసురుకుంటూ చిన్నబుచ్చుతూ వారిని మానసికంగా కుంగదీయడం వల్ల, అందరికీ దూరం చేయడం వల్ల... ఇలా అన్నీ ముప్పిరిగొని ప్రాణాలు పోయే స్థితికి వచ్చి ఉంటారు. టీబీ పై స్త్రీ విజయం సాధించాలంటే 2021 డిసెంబర్లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘విమెన్ విన్నింగ్ ఎగనెస్ట్ టీబీ’ అనే పేరుతో ఒక పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. స్త్రీలు టీబీపై విజయం సాధించడానికి కలుగుతున్న ఆటంకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఆమెకు తన జబ్బు మీద పోరాడటానికి తగినంత శక్తి, సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వెల్లడైంది. స్త్రీలు టిబిపై విజయం సాధించాలంటే ముందు ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ఎడతెగని ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఒకసారి టీబీ బయటపడ్డాక అలాంటి మహిళా పేషెంట్లు ఉన్న ఇళ్లను గుర్తించి వారికి వైద్య సహాయం మాత్రమే కాదు మానసిక నిబ్బరం కలిగించే కౌన్సిలింగ్ వ్యవస్థ బలపడాలి. ఈ వ్యవస్థ ఆ మహిళలకే కాదు కుటుంబానికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరొకటి– పౌష్టికాహారం. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే టీబీ సులభంగా నయం అయిపోతుంది. కాని భారతీయ కుటుంబాలలో ఇంటి చాకిరీ అంతా స్త్రీలే చేయాలి. విశ్రాంతి అనేది దొరకదు. ఇక అందరూ తిన్నాక ఆమె తినాలి. మరీ విషాదం ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వడం ఆమెను గొప్ప చేయడంగా కూడా భావిస్తారు. కాని ఇవన్నీ తప్పు. ఇలాంటి అవివేక ఆలోచనల వల్లే స్త్రీలు టీబీ కోరల నుంచి సులభంగా బయటకు రాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద టీబీ సోకిన పేషెంట్స్‌కు పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తుందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సమాజం బాధ్యత కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పరుస్తాయి. టీబీని సాకుగా చేసుకుని స్త్రీలను ఇబ్బంది పెట్టడాన్ని సమాజం అంగీకరించరాదు. కుటుంబంకాని, సమాజం కాని వెలి, వివక్షను పాటించక టీబీ ఉన్న స్త్రీల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది సులభంగా తగ్గిపోయే జబ్బు అన్న అవగాహన కలిగించి పేషెంట్స్‌కు ధైర్యం చెప్పాలి. వారు మందులు తీసుకునేలా చూడాలి. అలాంటి స్త్రీలను ఇదే సాకుగా వదిలించుకోవాలని చూసే మగాళ్లకు బుద్ధి చెప్పాలి. దగ్గు మొదలైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని, చూపించుకోవడానికి డబ్బులివ్వని మగవారిని మందలించాలి. ఆర్థికంగా ఆధారపడే స్త్రీకి తండ్రి, భర్త, కుమారుడి నుంచి సరైన వైద్యం ఇప్పించడానికి ఇరుగు పొరుగు చొరవ చూపాలి. స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ప్రతి కుటుంబం అక్కర చూపుతుందని ఆశిద్దాం. -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
క్షయరోగుల్లో యువతే అత్యధికం!
న్యూఢిల్లీ: దేశంలో క్షయ రోగం బారిన పడుతున్నవారిలో అత్యధికులు 15–45ఏళ్లలోపువారేనని ఆరోగ్య మంత్రి మాండవీయ చెప్పారు. దేశంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 65 శాతం ఈ వయసు గ్రూపులోనివారేనని తెలిపారు. టీబీ కేసుల్లో 58 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని, దీనివల్ల పలు కుటుంబాలు కుంగుబాటుకు గురవుతున్నాయని తెలిపారు. టీబీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వివరాలను ఆయన పార్లమెంట్ సభ్యులకు వివరించారు. ప్రతి ఎంపీ ఈ విషయంపై తమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలి్పంచాలని కోరారు. 15–45 సంవత్సరాల మధ్య వయసు్కలంటే ఉత్పాదకత అధికంగా ఉండే వయసని, సరిగ్గా ఈ వయసులో టీబీ బారిన పడడం అటు వారికి, ఇటు దేశానికి నష్టదాయకమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వేళ టీబీని అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతోందని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ చెప్పారు. -
కోవిడ్‌తో క్షయకు అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల ఒక వ్యక్తి క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది. ‘కోవిడ్ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్ నిర్ధారణ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది. -
టీవీ సిరీస్‌లో సానియా మీర్జా
ముంబై : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొట్టమొదటిసారి టీవీ సిరీస్‌లో నటించబోతున్నారు. క్షయ వ్యాధి (టిబి) పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎమ్‌టివి నిషేద్ అలోన్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సిరీస్‌లో సానియా మీర్జాగానే ఆమె కనిపించనున్నారు. దీనిపై సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘టీబీ మన దేశంలో అత్యంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ మహ్మరి బారినపడ్డ వారిలో సగానిపైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న అవాస్తవాలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, ప్రజల్లో మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కాగా, ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎమ్‌టీవీ ఇండియా, ఎమ్‌టీవీ నిషేద్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వేదికల్లో విడుదల కానుంది. నవంబర్ చివరి వారంలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ: సానియా -
ఉత్తర కొరియాకు భారత్ భారీ సాయం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం సాయాన్ని అందించనుంది. క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను ఉత్తర కొరియాకు పంపనుంది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో క్షయ వ్యాధి సంబంధిత ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కొరియాకు ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. దానికి భారత్ సానుకూలంగా స్పందించింది. సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన టీబీ మందులను పంపాలని భారత్ నిర్ణయం తీసుకుంది. చదవండి: కరోనా కట్టడి: ‘ఇది కొరియా షైన్ సక్సెస్’ ఈ మేరకు ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. ఇదిలా ఉండగా ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి ఎడ్విన్ సల్వడార్ ఆధ్వర్యంలో కొరియాకు అందజేసినట్లు ప్యాంగ్యాంగ్లోని భారత ఎంబసీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. చదవండి: నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి! -
క్షయ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ వ్యాధి పంజా విసురుతోంది. గతేడాది తెలంగాణలో ఏకంగా 2 వేల మంది చనిపోయారని రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం తాజాగా సర్కారుకు పంపిన క్షయ వార్షిక నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఏటికేటికీ క్షయ విస్తరిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. 2018లో 1,800 మంది చనిపోయారని తెలిపింది. కాగా, రాష్ట్రంలో 2017లో 44,644 టీబీ కేసులు గుర్తిస్తే, 2018లో 52,269 మందికి వ్యాధి సోకింది. 2019లో 70,202 మందికి వ్యాపించింది. అంటే ఏడాదిలోనే ఏకంగా 17,933 కేసులు అదనంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కొంత మేర తగ్గిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ పంజా విసురు తోంది. రాష్ట్రంలో ఇది ప్రబలంగా పెరుగుతుండ టంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందు లకు బ్యాక్టీరియా లొంగకపోవడం, దీనిపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి మరింత విస్తరిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధికం.. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. గతేడాది హైదరాబాద్‌లో అత్యధికంగా 12,658 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 4,439 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 4,025 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 3,668 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 403 మందికి మాత్రమే టీబీ సోకినట్లు నివేదిక తెలిపింది. కాగా, గతేడాది టీబీ, ఎయిడ్స్ రెండూ సోకినవారు రాష్ట్రంలో 2,196 మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది. 25 శాతం హెచ్ఐవీ బాధితుల మరణాలు టీబీ వల్లేనని తెలిపింది. క్షయ రోగులకు అందని కేంద్ర సాయం.. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో క్షయ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అయితే రాష్ట్రంలో అనేక మంది క్షయ రోగులకు ఆ ఆర్థిక సహాయం అందట్లేదు. వారికి బలమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది రోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2017 నవంబర్ నుంచి ఈ ఏడాది 2019 డిసెంబర్ వరకు 1,22,784 మంది క్షయ వ్యాధిగ్రస్తులు కేంద్ర ఆర్థిక సాయానికి అర్హులుగా తేలారు. అందులో 72,216 మందికి (59%) మాత్రమే సొమ్ము అందినట్లు నివేదిక తెలిపింది. ఇంకా 41 శాతం మంది క్షయ రోగులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. అత్యంత తక్కువగా నల్లగొండ జిల్లాలో 38 శాతం మందికి, జనగాం జిల్లాలో 46 శాతం మందికి నగదు అందింది. ఈ విషయంపై కేంద్రానికి విన్నవించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అత్యధికంగా భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 89 శాతం మందికి ఆర్థిక సహకారం అందిందని నివేదిక తెలిపింది. ఆ తర్వాత మెదక్ జిల్లాలో 84 శాతం మందికి నగదు అందింది. 2018లో రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు చేసిన వైద్య చికిత్సలో 98 శాతం సక్సెస్ రేటు ఉందని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అమానుషం: ఫొటోలు తీశారు గానీ...
పుదుచ్చేరి : ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి.. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న బాధితులకు... సహాయం కోసం అర్థిస్తున్న అభాగ్యులకు వీలైతే సహాయం చేయాల్సింది పోయి.. వారిని ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ బంధించి ఆనందించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని అతడి బంధువులు తోపుడు బండిలో తీసుకెళ్తుంటే బాటసారులు చోద్యం చూశారే తప్ప అంబులెన్సుకో లేదా మరేదైనా వాహనానికో ఫోన్ చేయలేదు. పరోక్షంగా అతడి మరణానికి కారణమయ్యారు. వివరాలు... తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం పూర్తిగా క్షీణించింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు. అయితే రోజూవారీ కూలీలైన సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో వారు అంబులెన్సుకు ఫోన్ చేయలేకపోయారు. దీంతో తమ ఇంట్లో ఉన్న తోపుడు బండిలో తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు మీద వాళ్లను చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాగా తోపుడు బండిపై ఆస్పత్రికి చేరుకునే సమయానికే సుబ్రమణి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే అక్కడ మరోసారి వాళ్లకు చేదు అనుభవమే ఎదురైంది. పుదుచ్చేరి సరిహద్దు నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు పుదుచ్చేరి వాహనాలకు అనుమతి లేకపోవడంతో.. శవంతో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసు అధికారి మురుగనందన్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన అంబులెన్సును రప్పించి సుబ్రమణి శవాన్ని సొంతూరికి తరలించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ ఇరులా తెగకు చెందిన సుబ్రమణి టీబీతో బాధపడుతున్నాడు. వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లిన క్రమంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. అయితే వాహన సదుపాయం లేకపోవడంతో సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లక పోవడంతో అతడు మరణించాడు. మార్గమధ్యలో ఎంతో మంది వారిని చూశారే గానీ ఒక్కరూ సహాయం చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటనే స్పందించి ఉంటే అతడి ప్రాణాలు నిలిచేవి’ అని పేర్కొన్నారు. -
‘టీబీని తరిమేద్దాం ’
గచ్చిబౌలి: దేశం నుంచి క్షయ(టీబీ) వ్యాధిని 2025 నాటికి నిర్మూలించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మాదాపూర్ హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ యూనియన్ అగినెస్ట్ ట్యూబర్కులోసిస్, లంగ్ డిసీజెస్ (ఐయూఏటీబీఎల్డీ) ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న ‘ఊపిరితిత్తుల ఆరోగ్యం’పై అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో ప్రభుత్వాల ప్రయత్నాలకు ప్రైవేట్ రంగంతోపాటు సమాజం కలసి రావాలని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ప్రైవేట్ వైద్యరంగానికి సూచించారు. కలసికట్టుగా పనిచేద్దాం ఐదేళ్లలో లక్ష్యాలను నిర్దేశించుకుని టీబీని తరిమేసేందుకు కలసికట్టుగా పనిచేస్తే భారత్ విజయం సాధిస్తుందని వెంకయ్య అన్నారు. క్షయ తోపాటు ఊపిరితిత్తుల వ్యాధుల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని అన్నారు. రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా భారత్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల శాతం 1.7 శాతానికి తగ్గిందన్నారు. ఇన్నోవేటివ్ మెడికల్ సైన్స్, బయో మెడికల్ రంగం పురోగతిలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఐయూఏటీబీఎల్డీ అధ్యక్షుడు జెరెమియ్య, ఉపా«ధ్యక్షుడు లూయిస్‌కాస్లో, టీఎఫ్‌సీసీఐ అ«ధ్యక్షుడు వెంకటేశ్వర్లు, 130 దేశాల నుంచి 400 మంది వైద్యులు పాల్గొన్నారు. టీబీ రహిత దేశమే లక్ష్యం : కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ మన్సూరాబాద్: 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకెళ్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో కామినేని ఆస్పత్రి ఆడిటోరియంలో బుధవారం టీబీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి అశి్వనీకుమార్ చౌబే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. చౌబే మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి టీబీ మహమ్మారిని తరిమేయాలని నిర్దేశించుకుందని, ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ 2025 కల్లా భారత్‌లో టీబీని అంత మొందిస్తామని పేర్కొన్నారని తెలిపారు. టీబీపై తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయమని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణే.. బంగారు తెలంగాణ: ఈటల ఆరోగ్య వంతమైన తెలంగాణను నిర్మిద్దాం.. ఆరోగ్య తెలంగాణ అయిననాడే బంగారు తెలంగాణ అని సీఎం కేసీఆర్ నమ్ముతున్నారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 2025 నాటికి దేశాన్ని టీబీ నుంచి విముక్తి చేస్తామని ప్రధాని చెబుతున్నారని, తెలంగాణలో అంతకు ముందే టీబీని ప్రారద్రోలుతామని అన్నారు. కార్యక్రమంలో కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపాల్ జి.సత్యనారాయణ, కామినేని వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
2025 నాటికి క్షయరహిత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను 2025 నాటికి క్షయ రహిత రాష్ట్రంగా మార్చాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని క్షయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 70వ టీబీ సెల్ క్యాంపెయిన్‌ను శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షయ నియంత్రణ కోసం చేపట్టే పరిశోధన చాలా ఖరీదైందని, అందువల్ల 2025 నాటికి నూటికి నూరు శాతం తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా మార్చడానికి కార్పొరేట్ రంగ భాగస్వామ్యం, సాయం అవసరమని పేర్కొన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ భయంకరమైన వ్యా«ధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కింద అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యులు సూచించినట్లు క్షయ రోగులు నిరంతరం చికిత్స తీసుకోవాలని, ఈ మేరకు క్షయ సంఘాలు చర్యలు చేపట్టాలన్నారు. క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యలకుగాను తెలంగాణ క్షయ సంఘాన్ని గవర్నర్ ప్రశంసించారు. అనంతరం విజేతలకు అవార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి తెలంగాణ క్షయ సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. -
పెద్ద మనసు చాటుకున్న యూపీ గవర్నర్
లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పెద్ద మనసు చాటుకున్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యంతోపాటు చదువు చెప్పిస్తానని వెల్లడించారు. గవర్నర్ అడుగుజాడల్లో నడిచిన రాజ్‌భవన్ సిబ్బంది మరో 21 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పిల్లలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తారు. 2025 నాటికి దేశం నుంచి క్షయను పూర్తిగా తరిమేద్దామనే ప్రధాని మోదీ పిలుపు మేరకు చర్యలు చేపట్టామని గవర్నర్ చెప్పారు. అందుకోసం రాజ్‌భవన్ నుంచే తమ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు. క్షయతో బాధపడుతున్న చిన్నారుల్ని దత్తత తీసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. తమకు తోచిన విధంగా సాయపడి క్షయ రోగులకు చేయూతనివ్వాలన్నారు. ఇక ప్రభుత్వ పథకాలకు అర్హులైనా కూడా చాలామంది వాటిని పొందలేకపోతున్నారని ఆనందిబెన్ చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యం కాదని.. చదువుకున్న వారు పేదలకు ప్రభుత్వ పథకాలు పొందేవిధంగా తోడు నిలవాలని కోరారు. ఇదిలాఉండగా.. లక్నో నగరంలోనే 14,600 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని జిల్లా వైద్యాధికారి పీకే గుప్తా తెలిపారు. పౌష్టిక ఆహారం కోసం వారికి నెలకు రూ.500 ఇస్తున్నామని తెలిపారు. -
ఇదేమి శి'క్షయా'..!
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్: జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి మరణాలకు దారి తీస్తోంది. ఏజెన్సీ, మెట్ట, డెల్టా అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్షయ పీడితులు పెరిగిపోతున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో క్షయ కేసులు అధికంగా నమోదవుతుండగా, ఏజెన్సీలో తక్కువగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో మరణాల సంఖ్య మాత్రం అధికంగా ఉంటోంది. జిల్లాలో మూడేళ్లుగా ఏటా 4,500 నుంచి ఐదు వేల కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు వైద్యులు చెబుతున్న ప్రకారం ఈ కేసుల సంఖ్య ఏటా మరో మూడింతలు అంటే 20 వేలకు పైమాటేనని తెలుస్తోంది. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి వేళ స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, బాగా చెమటలు పట్టడం, నెలల తరబడి దగ్గు ఉండటం వంటి లక్షణాలతో క్షయ బాధితులు కొన్ని సందర్భాల్లో మరణాలపాలవుతున్నారు. బాధితులు ఎవరంటే.. రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు క్షయ వ్యాధి దాడి చేస్తుంది. పొగ తాగేవారు, మద్యం అలవాటు ఉన్న వారు, మధుమేహం, హెచ్ఐవీ బాధితులు, గని కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికి వాడల్లో నివసించే వారు, గాలి సరిగా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన పోషకాహారం , నిద్ర వంటివి లోపించడం వలన రోగ నిరోధక శక్తి సన్నగిల్లే వారికి ఈ ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా క్షయ వ్యాధి ఊపిరితిత్తులకు సోకుతుంటుంది. ఇక్కడితోనే కాకుండా శరీరంలో గోళ్లు, వెంట్రుకలు మినహా ఏ భాగాన్నయినా క్షయ కబళిస్తుంది. క్షయ వ్యాధి విస్తరణకు.. జిల్లాలో క్షయ కేసుల సంఖ్య పెరగడానికి స్థానిక పరిస్థితులే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణంలో దుమ్మ ధూళి కణాలు పెరిగిపోవడం వలన క్షయ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వారి నుంచి వచ్చే బ్యాక్టీరియా గాల్లోని దుమ్ము ధూళి కణాలకు అతుక్కుపోయి, ఇతరులు ఆ గాలి పీల్చినపుడు వారి శరీరంలోకి చేరి వ్యాధిబారిన పడుతున్నారు. గతంలో మురికి వాడలు, ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి, ప్రస్తుతం దుమ్మ ధూళి కణాల ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏటా 5వేల కేసులు జిల్లాలో ఏటా 4,500 నుంచి 5 వేల వరకు క్షయ వ్యాధి కేసులు నమోదవుతున్నాయని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి డా.జి రత్నకుమారి తెలిపారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. క్షయ పీడిత జిల్లాల్లో మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. మురికివాడల్లోని పరిస్థితులే క్షయ వ్యాధికి ప్రధాన కారణం. ఇరుకు ఇళ్లల్లో, ఒకే గదిలో ఎక్కువ మది నివసించడం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు, శ్లాబ్‌లు, సిమెంట్ పనులు చేసే వారికి మార్కెట్లలో పని చేసే కార్మికులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. వ్యాధి నివారణకు జిల్లాలోని అన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధి గుర్తించి మందులు వాడితే ప్రాణాంతకం కాదు. క్షయ వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీపీసీఆర్ ఆధునిక యంత్రాలను గత రెండు రోజుల క్రితం 16 ఏరియా ఆసుపత్రిలకు అందిచాం. పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఉచితంగా ప్రభుత్వాసుపత్రిలు, పీహెచ్‌సీల్లో మందులు వాడితే వ్యాధి నయమవుతుంది. 2025నాటికి జిల్లాలో క్షయ వ్యాధి పూర్తిగా నిర్మూలనకు కృషి జరుగుతుంది.- డా.జి.రత్నకుమారి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి నివారణలో విఫలం వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి 10 మందిలో నలుగురిలో క్షయ క్రిమి ఉంటుంది. ఒంట్లో క్రిమి ఉన్నంత మాత్రాన వాళ్లంతా క్షయ బాధితులేం కాదు. శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి దానిని సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుతుంది. దీనిని ‘లేటెంట్ టీబీ’ అంటారు. శరీరంలో ఈ క్రిమి ఉన్న 10 శాతం మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వ్యాధి నిరోధక శక్తి లోపించినప్పుడు ఈ క్రిమి విజృంభించి క్షయ వ్యాధికి కారణమవుతుంది. ఇలాంటి వారిని తక్షణమే గుర్తించి సమర్థంగా చికిత్స చేస్తే ఈ క్రిమి వ్యాప్తి, విజృంభణ, ఉద్ధృతి తగ్గుతాయి. కానీ.. ఈ విషయంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతోంది. వ్యాధి బారిన పడిన వారు ప్రభుత్వాసుపత్రులకు వెళితే తప్ప ఈ కేసులు నమోదవటం లేదు. ప్రైవేటు వైద్యులు క్షయ అనుమానిత కేసులను నేరుగా ప్రభుత్వాసుపత్రికి పంపిస్తే తప్ప ఈ కేసులు ఉన్నట్టు గుర్తించలేని పరిస్థితి. గ్రామాలు, వార్డుల స్థాయిలో సర్వే నిర్వహించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. -
దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!
సాక్షి, న్యూఢిల్లీ: తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ అనే హీరోయిన్ ప్రస్తుతం టీబీ వ్యాధి భారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ సాయం కోసం ఆమె గతంలో మీడియా ద్వారా వేడుకోగా.. ఎట్టకేలకు ఆ విషయం సల్మాన్‌కి తెలిసింది. దబాంగ్ టూర్ లో భాగంగా పుణెకి వచ్చిన సల్మాన్ అనారోగ్యంతో బాధపడుతున్న పూజా దద్వాల్ పరిస్థితి విని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెకు సహాయం చేస్తానన్నారు. సల్మాన్ మాట్లాడుతూ...‘ఆమె అనారోగ్యంతో ఉన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే మా టీంని ఆసుపత్రికి పంపిచా. ఆమెకు కావాల్సిన సాయం అందిస్తా. ఆరోగ్యంతో పూజా దద్వాల్ బయటకు వస్తుందనే నమ్మకం ఉందని’ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఆమెను ఆదుకోవటానికి రేసుగుర్రం మూవీ ప్రతినాయకుడు రవికిషన్ ముందుకొచ్చి... తన స్నేహితుని ద్వారా పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. పూజా దద్వాల్ కొన్ని రోజుల కిందట ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘6 నెలల కిందట టీబీ ఉందని తెలిసింది. అప్పటి నుంచి సల్మాన్ ను సాయం అడుగుదామని యత్నిస్తున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నా వీడియోను చూస్తే ఎంతో కొంత సాయం చేస్తాడన్న ఆశ ఉంది. కొన్ని రోజులుగా ఇదే హాస్పిటల్లో ఉన్నాను. నా దగ్గర నయా పైసా కూడా లేదు. కనీసం టీ కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదంటూ’ పూజా వాపోయిన విషయం తెలిసిందే. పూజా ఆరోగ్యం బాగా లేదని తెలిసిన తర్వాత భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా గత కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు. -
క్షయని నోటిఫై చేయకుంటే జైలు శిక్ష
న్యూఢిల్లీ: క్షయ కేసుల వివరాలను వైద్యులు ఇకపై తప్పనిసరిగా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఔషధ విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాలతో గెజిట్ ప్రకటన జారీచేసింది. వైద్యులు, ఫార్మసీలు తప్పకుండా క్షయ వ్యాధి కేసులను నోటిఫై చేయాలని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. -
2025 నాటికి క్షయరహిత భారత్
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించడమే తమ లక్ష్యమని, 2025 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చాలనే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా 2030 నాటికి టీబీని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ మనదేశంలో ఐదేళ్ల ముందుగానే అంటే 2025 నాటికే దీనిని సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. క్షయ వ్యాధిపై అంతర్జాతీయంగా సాగించిన పోరాటం విజయవంతం కాలేదని, అందువల్ల క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు దీనిపై పోరాటంలో మార్పులు చేయడం అవసరమన్నారు. మంగళవారం ఢిల్లీలో టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని మోదీ ప్రారంభించారు. అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటేనే.. దేశంలోని ప్రతి టీబీ రోగికి.. మొదటిసారే పూర్తిస్థాయిలో వైద్యం అందజేయాలనే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మోదీ చెప్పారు. టీబీ నియంత్రణలో అన్ని రంగాల వారూ.. అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని, అప్పుడే టీబీ రహిత గ్రామం, పంచాయతీ, జిల్లా, రాష్ట్రాలను సాధించగలమన్నారు. ఈ అంటురోగం ప్రధానంగా పేదలపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని, క్షయ నివారణకు తీసుకునే ప్రతి చర్యా నేరుగా వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 25 ఏళ్ల క్రితమే టీబీని ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించిందని, అప్పటి నుంచి దీనికి అడ్డుకట్ట వేసేందుకు పలు దేశాలు అనేక చర్యలు చేపట్టాయని మోదీ చెప్పారు. వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇప్పటికీ మనం టీబీని నియంత్రించడంలో విజయం సాధించలేకపోయామన్నారు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా 90 శాతం మందికి క్షయ వ్యతిరేక టీకాలను అందుబాటులోకి తెస్తామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో మళ్లీ క్షయ కాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్ల క్రితమే అంతరించిందనుకున్న క్షయ (ట్యుబర్కులోసిస్) మళ్లీ విజృంభిస్తోంది. ఏటా ప్రతి లక్ష మందిలో 119 మంది టీబీ బారినపడుతుండగా ప్రతి సంవత్సరం దాదాపు 2,500 మంది మరణిస్తున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 45,315 మందికి ఈ వ్యాధి సోకింది. క్షయ రోగులలో ఎక్కువ మంది పేదలే ఉంటున్నారు. రోగులను గుర్తించకపోవడం వల్లే వ్యాధి నియంత్రణ సాధ్యం కావడంలేదు. క్షయ నియంత్రణ కోసం ఏటా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు. క్షయ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తప్పుబట్టింది. 2016లో దాదాపు 34,800 కేసులను రాష్ట్ర యంత్రాంగం నమోదు చేయలేదని నిర్ధారించింది. 1,376 క్లినిక్‌లు, 1,613 ఆస్పత్రులు, 437 పరీక్ష కేంద్రాలు కలిపి రాష్ట్రంలో 3,426 ప్రైవేటు వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఏ నిర్ధారించిన టీబీ కేసులలో ఒక్క దానిని సైతం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయలేదని విమర్శించింది. ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టీబీ నివారణపై కేంద్రం ఆదేశాలు... - క్షయ రోగులు వ్యాధి తగ్గే వరకు కచ్చితంగా మందులు వేసుకునేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా క్షయ బారిన పడుతున్న వారికి మెరుగైన మందులివ్వాలి. - గిరిజన ప్రాంతాల్లోని క్షయ బాధితులకు ఔషధాలతోపాటు చికిత్స పొందుతున్న రోజుల్లో నెలకు రూ. 750 చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. - క్షయ నివారణ చర్యల్లో చురుగ్గా పనిచేసే సిబ్బందికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకం అందించాలి. అలాగే రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా ప్రోత్సహించే సిబ్బందికి రూ. 1,500 చొప్పున, వ్యాధి తిరగబెట్టిన రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా చూసే సిబ్బందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకం అందించాలి. - రోగులను గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రికి రూ. 100 చొప్పున, ఆ రోగికి చికిత్స అందిస్తే రూ. 500 చొప్పున ఇచ్చే నగదు పురస్కారంపై అందరికీ అవగాహన కల్పించాలి. - జాతీయ క్షయ నివారణ సంస్థలో ఖాళీగా ఉన్న 17 రాష్ట్రస్థాయి పోస్టులను, జిల్లాల స్థాయిలో ఖాళీగా ఉన్న 222 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -
క్షయ వ్యాధిపై పోరాడండి: మోదీ
న్యూఢిల్లీ: క్షయ వ్యాధిపై యుద్ధ ప్రాతిపదికన పోరాడాలని, సవరించిన జాతీయ క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం(ఆర్ఎన్టీసీపీ) ప్రగతిపై కనీసం మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. క్షయ వ్యాధికి సంబంధించి కేస్ నోటిఫికేషన్లు, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ మొదలైన అంశాలపై నిశితంగా దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు. అంటువ్యాధుల్లో అతి ప్రమాదకరమైనది క్షయ అని, ఏటా సుమారు 29 లక్షల మంది దీనిబారిన పడుతున్నారని, ఇందులో సుమారు 4.2 లక్షల మంది ప్రజలు.. ముఖ్యంగా పేదలు టీబీ కారణంగా మరణిస్తున్నారని, దీంతో లక్షలాది మంది చిన్నారులు అనాధలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, క్షయ వ్యాధిగ్రస్థుల పౌష్టికాహారం కోసం నెలకు రూ.500 చొప్పున అందజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
'ధ్యానం, ఆరోగ్యాన్ని వేటితో ముడిపెట్టవద్దు'
భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత్‌లో ఎన్నో ఆచారాలు ఉన్నట్లే భిన్న నమ్మకాలున్నాయి... అయితే, ఈ విషయాలు ఆరోగ్యం, ధ్యానం లాంటి వాటికి అవరోధాలు కాకుడదని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డారు. పోలియోపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్తో పాటు బిగ్ బీ పాల్గొన్నారు. పోలియో మహమ్మారి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా మందుల గురించి వివరించేందుకు రెండు మొబైల్ వాహనాలను ప్రారంభించారు. పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్ని వర్గాల ప్రజలు తమ నమ్మకాల కారణంగా యోగా చేయడం లేదన్న విషయాన్ని గుర్తించారు. భారత్ అన్నది అన్ని వర్గాల సమాహారం. ధ్యానం చేయడానికి ప్రతిఒక్కరూ అంగీకరించే విధంగా కొత్త రకం ఏర్పాటుచేయాలని భావిస్తే ఏలా అని పేర్కొన్నారు. టీబీ లేని హర్యానా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలియో చుక్కలు ఎవరైనా వేసుకోవచ్చని, వీటిని ఏ అంశాలతోనూ ముడిపెట్టవద్దని సూచించారు. టీబీతో తాను పోరాడుతున్నానని, 2000లో దీన్ని గుర్తించినప్పటి నుంచి ఇలాంటి అంశాలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని భావించినట్లు బిగ్ బీ చెప్పుకొచ్చారు.