సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అధిక కేసులు నమోదు అవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, పాలకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని క్షయ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2022లో టీబీ కారణంగా ఏకంగా 1,892 మంది మరణించారు. 2021లో 2,055 మంది, 2020లో 2,300 మంది చనిపోయారు.
2022లో 72,911 కేసులు...
రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడం లేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో 52,269 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,243 మందికి, 2021లో 60,796 మందికి వ్యాధి సోకింది. 2022లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఏకంగా 72,911 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం.
2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
86.5 శాతం మందికి ఆర్థిక సాయం...
నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్దతిలో క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో కొందరు క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. వారికి బలవర్థకమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతం కంటే ఇది కాస్త మెరుగుపడిందని రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారులు అంటున్నారు.
2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అందింది. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి మాత్రమే ఆర్థికసాయం అందింది. మిగిలిన వారికి రాలేదని అధికారులు చెబుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment