Health Welfare Department
-
రాష్ట్రంపై క్షయ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అధిక కేసులు నమోదు అవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, పాలకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని క్షయ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2022లో టీబీ కారణంగా ఏకంగా 1,892 మంది మరణించారు. 2021లో 2,055 మంది, 2020లో 2,300 మంది చనిపోయారు. 2022లో 72,911 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడం లేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో 52,269 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,243 మందికి, 2021లో 60,796 మందికి వ్యాధి సోకింది. 2022లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఏకంగా 72,911 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం. 2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 86.5 శాతం మందికి ఆర్థిక సాయం... నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్దతిలో క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో కొందరు క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. వారికి బలవర్థకమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతం కంటే ఇది కాస్త మెరుగుపడిందని రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారులు అంటున్నారు. 2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అందింది. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి మాత్రమే ఆర్థికసాయం అందింది. మిగిలిన వారికి రాలేదని అధికారులు చెబుతున్నారు -
కంట్లో చీకట్లు
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.. అయితే ముఖ్యమైన ఆ కన్నే ప్రమాదంలో పడిందిప్పుడు. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం తదితర కారణాల వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లలకు పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. శుక్లాల కారణంగానే 43 శాతం మంది కంటిచూపు కోల్పోతున్నారని నిపుణు లు నిర్ధారించారు. మధుమేహం కారణంగా కంటిచూపు సమస్యల(డయాబెటిక్ రెటినోపతి)తో బాధపడుతున్నవారూ పెరుగుతున్నా రు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరు కాకుండా మరో 7 శాతం మంది చూపు కోల్పోయేందుకు కారణమయ్యే నీటి కాసులు(గ్లకోమా) సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంధత్వ నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. 550 గ్రామాలను ఎంపిక చేసి 2017 అక్టోబర్‌లో సర్వే మొదలుపెట్టింది. ఇటీవల వివరాలను నమోదు చేసింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రతి వంద మందిలో ఇద్దరు కంటి చూపు సమస్యలతో బాధపడుతుండగా పట్టణాల్లో వంద మందిలో ఒకరు ఈ ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా శుక్లాల సమస్యతోనే కంటిచూపు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 3.21 లక్షల శుక్లాల చికిత్సలు నిర్వహించారు. నేత్రదానంతో 5,126 మంది కంటిచూపును పొందారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్లే.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పోషకాహా రం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోనే కంటిచూపు సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు 7 శాతం మంది ఉంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన వారిలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ సమస్య వస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని పిల్లల్లో కంటి చూపు సమస్య బాధితులు పెరుగుతున్నారు. 2014–15లో 5,44,469 మంది విద్యార్థుల్లో 24,947 మందికి కంటి చూపు సమస్యలున్నాయి. 2015– 16లో 6,53,156 మందిని పరీక్షించగా... 40,264 మంది బాధితులున్నారు. 2016– 17లో 6,10,234 మంది లో 40,367 మంది విద్యార్థులకు చూపు సమస్యలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స ఏర్పాట్లు... కంటి చూపు సమస్యల నివారణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెడుతోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘అంధత్వ రహిత తెలంగాణ(అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ–ఏబీఎఫ్‌టీ)’పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. నేత్ర వైద్య నిపుణులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఇందుకోసం మొదటి దశలో 2017–18లో 10 జిల్లాలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది 10 జిల్లాల్లో, మరో ఏడాది ఇంకో 10 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 2019 నాటికి కంటిచూపు సమస్యలు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ మోతీలాల్, జాయింట్ డైరెక్టర్, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం శుక్లాల సమస్యతోనే ఎక్కువ మందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం సైతం కంటి సమస్యలకు కారణమవుతోంది. పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే కంటి చూపు సమస్యలు వస్తుంటాయి. మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రవీందర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
ఆరోగ్య శాఖలో 11వేల పోస్టుల భర్తీకి ఆమోదం
మంత్రి యూ.టి.ఖాదర్ త్వరలో నోటిఫికేషన్ జారీ ఆశా కార్యకర్తల ఖాతాల్లో గౌరవ వేతనం సాక్షి, బెంగళూరు : కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 11 వేల పోస్టులను దశలవారీగా భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించినట్లు కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి యు.టి. ఖాదర్ తెలిపారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు సార్లు చొప్పున కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రస్తుతం ఖాళీగా ఉన్న 11వేల పోస్టులు వచ్చే ఐదేళ్లలో భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా మొదటి దశలో 250-300 డాక్టర్లు, 1,755 ఎండీ, 2వేల నర్సులు, 4వేల గ్రూప్-డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖలో నూతన సంక్షేమ పథకాలు ప్రారంభించే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నామన్నారు. రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు నెలకు 2వేల గౌరవ వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాలకే నేరుగా వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెలైట్ ప్రతిపాదికన నాలుగు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘108’ అంబులెన్స్‌లు 500 వరకు ఉన్నాయని త్వరలో 98 నూతన అంబులెన్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు సంస్థల సహకారంతో ‘మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలను’ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒక్కొక్క కేంద్రం నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.20 వేలు కేటాయించనున్నట్లు వివరించారు.