- మంత్రి యూ.టి.ఖాదర్
- త్వరలో నోటిఫికేషన్ జారీ
- ఆశా కార్యకర్తల ఖాతాల్లో గౌరవ వేతనం
సాక్షి, బెంగళూరు : కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 11 వేల పోస్టులను దశలవారీగా భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించినట్లు కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి యు.టి. ఖాదర్ తెలిపారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు సార్లు చొప్పున కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రస్తుతం ఖాళీగా ఉన్న 11వేల పోస్టులు వచ్చే ఐదేళ్లలో భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు.
సాధ్యమైనంత త్వరగా మొదటి దశలో 250-300 డాక్టర్లు, 1,755 ఎండీ, 2వేల నర్సులు, 4వేల గ్రూప్-డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖలో నూతన సంక్షేమ పథకాలు ప్రారంభించే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నామన్నారు.
రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు నెలకు 2వేల గౌరవ వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాలకే నేరుగా వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెలైట్ ప్రతిపాదికన నాలుగు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ‘108’ అంబులెన్స్‌లు 500 వరకు ఉన్నాయని త్వరలో 98 నూతన అంబులెన్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు సంస్థల సహకారంతో ‘మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలను’ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒక్కొక్క కేంద్రం నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.20 వేలు కేటాయించనున్నట్లు వివరించారు.