- ఒకే దశలో లోక్‌సభ ఎన్నికలు
- 19న నోటిఫికేషన్
- ఏప్రిల్ 17న పోలింగ్
- మే 16న ఫలితాలు
- అమలులోకి కోడ్
- ఆగిన అభివృద్ధి పనులు
- హఠాత్తుగా బోసిపోయిన సౌధ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 17న ఒకే రోజు పోలింగ్ జరుగనుంది. అయితే ఎన్నికల ఫలితాల కోసం దాదాపు నెల రోజుల పాటు అంటే...మే 16 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం...ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 27న ముగుస్తుంది. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఐదు ఎస్‌సీ నియోజక వర్గాలు, రెండు ఎస్‌టీ నియోజక వర్గాలు ఉన్నాయి. మిగిలిన 21 జనరల్ స్థానాలు.
అప్పుడే నియమావళి ప్రభావం
కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్ర పాలనా కేంద్రం విధాన సౌధలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో సందడి తగ్గిపోయింది. మంత్రులు, రాజకీయ నాయకుల హడావుడి కనిపించ లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోలారు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన మంత్రి వర్గ సహచరులు విధాన సౌధ వైపు కన్నెత్తి చూడలేదు. ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలు రద్దయ్యాయి. మొత్తానికి విధాన సౌధ హఠాత్తుగా బోసిపోయింది. మే 16 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.