నిరాశొద్దు..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసినంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమిపై ఇక్కడి ప్యాలెస్ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల ఆత్మావలోకనం సభలో ప్రసంగించిన నాయకులంతా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు.
ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఈ ఓటమి తాత్కాలికమేనని అన్నారు. సభను ప్రారంభించిన అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రల్లో మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
బీజేపీ వారు సోషల్ సైట్లను విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా మన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే, ప్రజాందోళనలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
సవాలుగా స్వీకరించాలి
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని సవాలుగా స్వీకరించాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుకుగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని, పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఎన్నో ఆశలు రేపి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గత నెలగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఆయన నుంచి ఉత్తమ పాలనను ఆశించలేమని అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, జనార్దన పూజారి సహా రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పరమేశ్వరకు మద్దతుగా ధర్నా
పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుమకూరు జిల్లా కొరటగెరె నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే కారణమంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొరటగెరె నియోజక వర్గంలో ఒక్క పనీ జరగడం లేదని వారు ఆరోపించారు. కాగా గత శాసన సభ ఎన్నికల్లో పరమేశ్వర ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.