- తొలగని ప్రతిష్టంభన
- తుది జాబితాకు కాంగ్రెస్, బీజేపీ కుస్తీ
- మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జన
- జాఫర్ షరీఫ్‌తో సీఎం భేటీ
- పార్టీని వీడొద్దంటూ బుజ్జగింపు
- రేపు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు జాఫర్ ప్రకటన
- తనకు టికెట్టు ఇప్పించే సామర్థ్యం సీఎంకు లేదని వెల్లడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సమీపిస్తుండడంతో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయడానికి ప్రధాన రాజకీయ పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు గాను కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన మూడేసి నియోజక వర్గాలు ఇరు పార్టీలకూ చిక్కుముడిగా తయారయ్యాయి. కాంగ్రెస్ హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
హావేరిలో మాజీ ఎమ్మెల్యేలు డీఆర్. పాటిల్, సలీం అహ్మద్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఒకరిని ఎంపిక చేయడం పార్టీకి కత్తి మీద సాములా తయారైంది. ధార్వాడ స్థానానికి మంజునాథ్ కున్నూర్, సయ్యం అజంపీర్ పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ ఐజీ. సనది కూడా టికెట్టును ఆకాంక్షిస్తున్నారు. ఉత్తర కన్నడ స్థానం కోసం ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత్ దేశ్‌పాండే, రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా తనయుడు నివేదిత ఆళ్వాల మధ్య రసవత్తర పోరు నెలకొంది. మరో వైపు బీజేపీలో కూడా బీదర్, హాసన స్థానాలపై ప్రతిష్టంభన నెలకొంది.
బళ్లారికి అభ్యర్థిని ప్రకటించక పోయినప్పటికీ శ్రీరాములు అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. హాసన స్థానాన్ని మైసూరు మాజీ ఎంపీ సీహెచ్. విజయ్ శంకర్‌కు కేటాయించినప్పటికీ, అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన ససేమిరా అంటున్నారు. మైసూరు తప్ప తాను ఎక్కడి నుంచీ పోటీ చేసేది లేదని భీష్మించారు. ఆయనను అనునయించడానికి పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. బీదర్ స్థానానికి ఎమ్మెల్యే గురుపాదప్ప నాగమారపల్లి లేదా ఆయన కుమారుడు సూర్యకాంత్ నాగమారపల్లిల్లో...ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక పార్టీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
జాఫర్ షరీఫ్‌తో సీఎం భేటీ
బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని తనకు కేటాయించనందుకు కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జాఫర్ షరీఫ్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో కలుసుకుని బుజ్జగించడానికి ప్రయత్నించారు. తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లే యోచన చేయడం మంచిది కాదని సూచించారు. షరీఫ్ జేడీఎస్‌లో చేరే యోచనలో ఉన్నారు. ఆయనకు మైసూరు స్థానాన్ని కేటాయించడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంది. సీఎంతో సమావేశమైన అనంతరం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ బుధవారం తాను హజ్ యాత్రకు వెళుతున్నానని, తిరిగి వచ్చిన అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రికి తన టికెట్టు ఇప్పించే సామర్థ్యం లేదన్నారు. సోనియా గాంధీ జోక్యం చేసుకోవాలని సూచించారు.