- వేచిచూసీ...చూసి
- దళాధిపతికి నిరాశ
- కాంగ్రెస్, బీజేపీల్లో చల్లారిన అసంతృప్తి
- వారికి టికెట్లిచ్చి లబ్ధిపొందేలా దేవెగౌడ వ్యూహం
- ఇక 12 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి
- రెండు రోజులే గడువు.. ఆగమేఘాలపై గాలింపు
- తనకూ టికెట్ ఇవ్వాలంటున్న మరో కోడలు భవానీ రేవణ్ణ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్, బీజేపీల్లోని అసంతృప్తులకు టికెట్లు ఇవ్వడానికి ఇన్నాళ్లూ ఎదురు చూసిన జేడీఎస్ అధినేత హెచ్‌డీ. దేవెగౌడ తీవ్ర నిరాశకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆయా పార్టీల్లో టికెట్లు దక్కని వారిని అక్కున చేర్చుకుని తన పార్టీ తరఫున ఎన్నికల గోదాలో దించడానికి దళాధిపతి వేచి చూశారు. అయితే అసంతృప్తులను బుజ్జగించడంలో ఇరు పార్టీలు విజయం సాధించడంతో ఇప్పుడు 12 నియోజక వర్గాలకు కొత్తగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నామినేషన్లను దాఖలు చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆగమేఘాల మీద అభ్యర్థులను వెతికి పట్టుకోవడానికి దేవెగౌడ నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీకే. జాఫర్ షరీఫ్ కాంగ్రెస్‌ను వీడి జేడీఎస్‌లో చేరడం దాదాపు ఖాయమనుకుంటున్న దశలో హఠాత్తుగా వెనక్కు తగ్గారు. మైసూరు నుంచి ఆయన జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగింది. మూడు రోజుల కిందట ఆయన మక్కా యాత్రకు బయల్దేరారు.
తిరిగి రాగానే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు కూడా. మక్కాలో ఉన్న ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ఫోనులో సంప్రదించి బుజ్జగించింది. రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చింది. దీంతో షరీఫ్ తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి సోమవారం ఆయన నగరానికి తిరిగి రావాల్సి ఉంది. మరో వారం రోజుల పాటు వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్‌కే చెందిన మాజీ పోలీసు అధికారి హెచ్‌టీ.
సాంగ్లియానాను బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా బరిలోకి దించాలనుకున్న దళాధిపతి ఆశలూ అడియాసలయ్యాయి. ఢిల్లీలో అధిష్టానాన్ని సంప్రదించిన అనంతరం ఆయన తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. బీదర్ బీజేపీ టికెట్టును తన కుమారుడు సూర్యకాంత్ నాగమారపల్లికి ఇవ్వాలని పట్టుబడుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే గురుపాదప్ప నాగమారపల్లిని దువ్వడానికి కూడా దేవెగౌడ ప్రయత్నించారు. అయితే తాను జేడీఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని గురుపాదప్ప తేల్చి చెప్పారు. బెల్గాం, బాగలకోటె, బిజాపుర, బళ్లారి స్థానాలకు ఇంకా అభ్యర్థులే దొరకలేదు.
కుటుంబంలోనూ కలహాలు
పార్టీలోకి వస్తారనుకున్న వారు రాకపోవడం, కొన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులే లేకపోవడం లాంటి ప్రతికూల పరిస్థితులతో తల బొప్పి కడుతుండగా, కుటుంబ కలహాలూ దళాధిపతికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అనితా కుమారస్వామి పోటీ చేస్తే తనకూ టికెట్టు ఇవ్వాలని మరో కోడలు భవాని రేవణ్ణ పట్టుబడుతున్నారు. తొలుత అనితా కుమారస్వామిని చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేయించాలనుకున్నా, ఈ పరిణామంతో ఏకంగా కుమారస్వామినే రంగంలోకి దించాలని దేవెగౌడ నిర్ణయించారు.
కుమారను ఆదేశించా...
చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేయడానికి కుమారస్వామి నిరాకరించారని దేవెగౌడ తెలిపారు. ఇక్కడి పద్మనాభ నగరలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ అనివార్యత వల్ల పోటీ చేసి తీరాలని ఆయనను ఆదేశించానని చెప్పారు. బెంగళూరులోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం అభ్యర్థి అబ్దుల్ అజీం, సెంట్రల్ అభ్యర్థి నందిని ఆళ్వా, దక్షిణ నియోజక వర్గం అభ్యర్థి రూత్ మనోరమలకు బీ ఫారాలు ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం విడుదల చేస్తానని ఆయన చెప్పారు.