ఆరుగురు ఔట్...ఒకరు ఇన్ | One in six out of the ... | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఔట్...ఒకరు ఇన్

Published Mon, May 26 2014 2:29 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

One in six out of the ...

  • వయోభారం, అనారోగ్యం కారణంగా కొందరిపై వేటు !
  •  సహాయ నిరాకరణ చేశారని మరికొందరు పదవులు కోల్పోయే అవకాశం
  •  డీసీఎంగా పరమేశ్వర్ ?
  •  28న ఢిల్లీకి సీఎం, కేపీసీసీ చీఫ్
  • సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలిలో కూడికలు, తీసివేతలు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్నట్లు అన్నీ జరిగితే ఈ ప్రక్రియ నెలాఖరుకు ఒక కొలిక్కి తీసుకు రావాలని అటు అధిష్టానంతో పాటు ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అయినా మంత్రి మండలిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

    తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా ప్రకాశ్ బాబయ్య హుక్కేరి ఎన్నిక కావడంతో ఆ స్థానం కూడా ఖాళీ అవ బోతుంది. మరోవైపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏడాది కాలంలో ప్రస్తుత మంత్రుల పనితీరుపై పార్టీ అధిష్టానంకు నివేదిక పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన పార్టీ పెద్దలు ఆరుగు రు మంత్రులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే గనుక జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో ఖాళీ బెర్తుల సంఖ్య పదికి చేరనుంది.

    ఇన్ని ఖాళీలతో ప్రభుత్వాన్ని నడపడం చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. మరోవైపు మంత్రి పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కన్నేసి ఉంచారు. ఒక వేళ ఈ మంత్రి పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయకపోతే పాలన కుంటుబడటంతో పాటు పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు హైకమాండ్ భావిస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా మంత్రి పదవులను భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఈసారి మంత్రి పదవుల కేటాయింపులో సీనియార్టీకి కాకుండా సమర్థతతకు, యువకులకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
     
    సిద్ధుకు చెక్ పెట్టడానికి...

    షెడ్యూల్ కులానికి చెందిన పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్  చాలా కాలంగా ఉంది. మరోవైపు పార్టీ సీనియర్ నాయకులకు సీఎం సిద్ధరామయ్య విలువ ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను గాడిలో పెట్టడానికి పరమేశ్వర్‌కు డీసీఎం పదవి ఇవ్వాలని బహిరంగంగానే పేర్కొంటున్నారు.

    ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ పరమేశ్వర్‌కు డీసీఎం పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. రాజ్యసభ, పరిషత్ సభ్యుల ఎంపికపై చర్చించేందుకు ఈనెల 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమయంలోనే ఈ కూడికలు తీసివేతల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.
     
    ఉద్వాసన ఎవరికి? ఎందుకు?

    ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల మంత్రి పదవిని తప్పించాలని నిర్ణయించారు. ముఖ్యమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ ఆనారోగ్య కారణంతో విధులను సరిగా నిర్వహించలేకపోతున్నట్లు హైకమాండ్ నిర్ధారణకు వచ్చింది. మంత్రులు ఖమరుల్లా ఇస్లాం, అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారు.

    కిమ్మెన  రత్నాకర్‌కు క్లీన్ ఇమేజ్ ఉన్నా తనపై వస్తున్న ఆరోపణలు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నట్లు ఢిల్లీ పెద్దలకు నివేదిక అందింది. ఇక పార్లమెంటుకు వెలుతుండటం వల్ల ప్రకాశ్ బాబయ్య హుక్కేరిని మంత్రి పదవి నుంచి తొలగించి వేరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన ట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement