చిరు ప్రచారంపై మెగా అనుమానాలు
- ‘అన్నయ్య’తో ప్రచారానికి జంకుతున్న అభ్యర్థులు
- నాడు ఎలాంటి ఫలితమివ్వని ‘గౌరిబిదనూరు’ రోడ్ షో
- విభజన నేపథ్యంలో నేడు చిరుపై మరింత వ్యతిరేకత
- ప్రచారం చేస్తే ఉన్న ఓట్లనూ కోల్పోయే పరిస్థితి
- గతంలో కాంగ్రెస్ కరపత్రాలపై చిరంజీవి బొమ్మలు
- నేడు ఆయన ఫొటో లేకుండా జాగ్రత్తలు
బెంగళూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నేతలు కొందరు చిరంజీవి ప్రచారానికి వస్తారంటూ ప్రకటనలు చేస్తున్నా, కాంగ్రెస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడడం లేదు. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనుంది. కనుక ప్రచారానికి పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ర్టంలో ఐదారు బహిరంగ సభల్లో ప్రసంగించి వెళ్లారు. బుధవారం సోనియా గాంధీ వస్తున్నారు.
తెలుగు మాట్లాడే వారు అధిక సంఖ్యలో ఉన్న కోలారు, చిక్కబళ్లాపురంలతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో చిరంజీవి చేత ప్రచారం చేయించడానికి గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడే వారు. ముఖ్యంగా కోలారు జిల్లాలో ఉప ఎన్నికలప్పుడు కూడా కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప మరీ దగ్గరుండి చిరంజీవిని పిలుచుకు వచ్చారు. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన పరిణామాలు కర్ణాటకలో ప్రభావం చూపుతున్నాయి.
పట్టుబట్టి మరీ... రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌పై ప్రవాసాంధ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగస్వామి అయిన చిరంజీవి అంటేనే... సరిహద్దు జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు మండి పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనను ప్రచారానికి తీసుకు వస్తే కలిగే లాభం కన్నా నష్టమే అధికమని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు మాట్లాడే వారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో కర పత్రాలపై చిరంజీవి బొమ్మలు వేసుకునే వారు.
ఈసారి అలాంటి బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల సందర్భంగా చిరంజీవి ప్రచారం చేసిన నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సినీ నటుడుగా ఆయనను చూడడానికి జనం ఎగబడడం వాస్తవమే అయినా, అవన్నీ ఓట్ల రూపంలో పరివర్తన చెందడం లేదని వారు విశ్లేషిస్తున్నారు.
మరో వైపు అనంతపురం జిల్లాను ఆనుకుని ఉన్న గౌరిబిదనూరు నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు చిరంజీవి... కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి తరఫున ప్రచారం చేశారు.
అయితే చిరంజీవి అభిమానులంతా ఆయనకు వ్యతిరేకంగా ఓ ఇండిపెండెంట్‌కు మద్దతు పలికారు. ఈ పరిణామాల నడుమ ఈసారి చిరంజీవి ప్రచారం అనుమానమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక మోడీ తరఫున చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వినిపించినా, ఇప్పటి వరకు అలాంటి సంకేతాలేవీ అందలేదు.