మళ్లీ అసమ్మతి
- మండ్యలో రమ్యకు గడ్డు కాలం
- తార స్థాయికి గ్రూపు రాజకీయాలు
- రమ్య రోడ్ షోను అడ్డుకున్న ఓ వర్గం
- ఇరు వర్గాల ఘర్షణ.. దాడులు
- అర్ధంతరంగా ముగిసిన ప్రచారం
మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు చోటుచేసుకోవడంతో మళ్లీ అసమ్మతి భగ్గుమంది. ఓటింగ్‌కు పట్టుమని పది రోజులు కూడా లేని సమయంలో ‘హస్తం’ నాయకులు బహిరంగంగానే పర్పస్పర దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, శాండల్‌వుడ్ నటి రమ్య రోడ్ షోను ఆ పార్టీ నేతలే అడ్డుకోవడం.. దీంతో ఆమె ప్రచారం ఆపేసి వెనక్కు వెళ్లడం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరుకు నిదర్శనం.
సాక్షి, బెంగళూరు / మండ్య, న్యూస్‌లైన్ : మండ్య లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆ పార్టీ అభ్యర్థి, సినీ నటి రమ్య శనివారం రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆ పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. వివరాలు.. మండ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్మానంద, రమ్య మధ్య విభేదాలున్నాయి. ఆత్మానందకు మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ మద్దతు ఉంది.
రమ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎస్‌ఎం కృష్ణనే. దీంతో ఆత్మానంద, రమ్య వర్గాల మధ్య సంధి కుదుర్చాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్‌ఎం కృష్ణను రాయబారానికి ఒప్పించారు. దీంతో కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల వారితో ఆయన భేటీ అయ్యారు.
కృష్ణ రాయబారం ఫలించింద ని, ఇక పార్టీలో అంతా కలిసి కట్టుగానే ఉంటారని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి శనివారం భగ్గుమంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రమ్య మండ్య జిల్లా బేలూరు గ్రామంలో శనివారం రోడ్ షో నిర్వహించారు. రమ్య వాహనంపైకి ఆత్మానందతో పాటు అతని అనుచరుడు రవీంద్ర శ్రీకంఠయ్య కూడా ఎక్కి ప్రచారంలో పాల్గొన్నారు. ఇది అంబరీష్ అనుచరులకు మింగుడుపడలేదు. దీంతో లింగరాజు అనే నేత నేతృత్వంలో కార్యకర్తలు ఆ రోడ్‌షోను అడ్డుకున్నారు. తామూ వాహనాన్ని ఎక్కి ప్రసంగిస్తామని పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
బహిరంగంగానే ఒకరి పై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఇదే సందర్భంలో రోడ్ షోలోని ఓ వాహనం అదుపు తప్పి శ్రీనివాస్ అనే కార్యకర్త కాలుపై వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే బాధితుడ్ని స్థానిక ఆస్పత్రికి తరిలించారు. ఆత్మానంద సర్దిచెప్పడంతో రెండు గంటల తర్వాత రోడ్‌షో తిరిగి ప్రారంభమైంది.
ఇరు వర్గాల అరుపులు, కేకల మధ్యే రమ్య రోడ్ షో సూగానహళ్లి చేరుకుంది. స్థానిక కాంగ్రెస్ నేత సచ్చిదానంద ఫొటో అక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లలో లేకపోవడంతో ఆయన మద్దతుదారులు రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మళ్లీ రోడ్‌షోను అడ్డుకున్నారు. దీంతో విసుగుచెందిన రమ్య తన రోడ్‌షోను అర్ధంతరంగా ఆపేసి వెనక్కు వెళ్లిపోయారు.