వార్.. మొదలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని 28 లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 17న జరుగనున్న ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ జారీ అవుతుంది. దరిమిలా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 27న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. మే 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. అంటే... పోలింగ్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు విజేతలెవరో తెలుసుకోవడానికి వేచి చూడాల్సి ఉంటుంది.
కాగా నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులకు కట్టుదిట్టమైన నిబంధనలను విధించారు. నామినేషన్లను దాఖలు చేయాల్సిన కార్యాలయానికి అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే రావాల్సి ఉంటుంది. మూడు వాహనాలకు అవకాశం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు.
ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లను సమర్పించవచ్చు. ఆస్తుల వివరాలు, నేర నేపథ్యం ఉంటే...దాని గురించీ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ మొత్తంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో ఆరో వంతు తెచ్చుకోలేని అభ్యర్థులకు ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.
స్వేచ్ఛాయుత పోలింగ్‌కు చర్యలు
లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ అలోక్ శుక్లా అధికారులకు సూచించారు. విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సహా వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేట్లు చూడాలని, ఎన్నికల అక్రమాలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ఆయన సూచించారు. రాగ ద్వేషాలకు అతీతంగా పని చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా పడి ఉండే మద్యం నిల్వల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అబ్కారీ శాఖ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా పాల్గొన్నారు.