సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్‌మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది.
కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది.
గ్రామ స్థాయిలోనే
ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు.
టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు.
దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది.
త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో
నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా
అమలు చేస్తారు.
93 శాతం సక్సెస్ రేటు
దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది.
గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు.
త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా
పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది.
ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment