న్యూఢిల్లీ: క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించడమే తమ లక్ష్యమని, 2025 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చాలనే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా 2030 నాటికి టీబీని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ మనదేశంలో ఐదేళ్ల ముందుగానే అంటే 2025 నాటికే దీనిని సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు.
క్షయ వ్యాధిపై అంతర్జాతీయంగా సాగించిన పోరాటం విజయవంతం కాలేదని, అందువల్ల క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు దీనిపై పోరాటంలో మార్పులు చేయడం అవసరమన్నారు. మంగళవారం ఢిల్లీలో టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని మోదీ ప్రారంభించారు.
అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటేనే..
దేశంలోని ప్రతి టీబీ రోగికి.. మొదటిసారే పూర్తిస్థాయిలో వైద్యం అందజేయాలనే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మోదీ చెప్పారు. టీబీ నియంత్రణలో అన్ని రంగాల వారూ.. అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని, అప్పుడే టీబీ రహిత గ్రామం, పంచాయతీ, జిల్లా, రాష్ట్రాలను సాధించగలమన్నారు. ఈ అంటురోగం ప్రధానంగా పేదలపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని, క్షయ నివారణకు తీసుకునే ప్రతి చర్యా నేరుగా వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 25 ఏళ్ల క్రితమే టీబీని ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించిందని, అప్పటి నుంచి దీనికి అడ్డుకట్ట వేసేందుకు పలు దేశాలు అనేక చర్యలు చేపట్టాయని మోదీ చెప్పారు. వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇప్పటికీ మనం టీబీని నియంత్రించడంలో విజయం సాధించలేకపోయామన్నారు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా 90 శాతం మందికి క్షయ వ్యతిరేక టీకాలను అందుబాటులోకి తెస్తామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment