హార్సిలీ కొండకు ఏదీ అండ?
► సమస్యలు పట్టించుకునే దిక్కులేదు
► 11ఏళ్లలో టౌన్‌షిప్ కమిటీ భేటీ నాలుగుసార్లే
► నేడు కలెక్టర్, టూరిజం, శాఖల అధికారుల సమావేశం
బి.కొత్తకోట: రాష్ర్టంలో ఏకైక వేసవి విడది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్. ఇది రాష్ట్రంలోనే ఏకైక పర్వత నివాస ప్రాంతం. ప్రస్తుతం టౌన్‌షిప్ కమిటీగా కొనసాగుతోంది. డివిజన్ స్థాయి అధికారులు సభ్యులుగా, మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ సమావేశాలు నామమాత్రంగా మారిపోయాయి. తీసుకొన్న నిర్ణయాలు అమలు గాలికి వదిలేస్తున్నారు. కొన్ని సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పరిధిలోని కొండను 2000లో ప్రభుత్వం తొలగించింది.
ప్రత్యేకంగా టౌన్‌షిప్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కమిటీయే తీర్చాల్సి ఉంటుంది. దీనికోసం తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షించి చర్యలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గడచిన 11 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కమిటీ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోమవారం హార్సిలీహిల్స్‌లో పర్యటించనున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరముంది.
ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలివీ..
►పొరుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలి.
►ఎంతో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.
►రెవెన్యూ అతిథిగృహాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
►చెట్టుపై అతిథిగృహ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
►కొండపైనున్న బండరాళ్లు ఘాట్ రోడ్డుపై పడుతున్నాయి.
►రోప్‌వే మార్గంపై రీసర్వే అటకెక్కింది.
►రాత్రివేళ ఆరోగ్య సమస్య ఎదురైతే తలనొప్పికీ మాత్ర దొరకదు. విషసర్పాలు కాటేస్తే చావాల్సిందే.
►స్థానికంగా ఒక ఏఎన్‌ఎంను నియమించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
►పర్యాటకుల కోసం మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలి.
►మురికినీరు, వాడేసిన వ్యర్థాలు రోడ్లపై వేయకుండా తొట్టెలు, కాలువలు నిర్మించాలి.
►గాలిబండపై మందుబాబుల వీరంగాలు తగ్గడం లేదు.
►మద్యం సీసాలను పగులగొట్టడంతో గాజు పెంకులతో గాలిబండ భయానకంగా తయారైంది.
►వీధిలైట్లు పూర్తిగా వేయకపోవడంతో రాత్రివేళల్లో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.