Harsilihils
-
హార్సిలీ కొండకు ఏదీ అండ?
► సమస్యలు పట్టించుకునే దిక్కులేదు ► 11ఏళ్లలో టౌన్షిప్ కమిటీ భేటీ నాలుగుసార్లే ► నేడు కలెక్టర్, టూరిజం, శాఖల అధికారుల సమావేశం బి.కొత్తకోట: రాష్ర్టంలో ఏకైక వేసవి విడది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్. ఇది రాష్ట్రంలోనే ఏకైక పర్వత నివాస ప్రాంతం. ప్రస్తుతం టౌన్షిప్ కమిటీగా కొనసాగుతోంది. డివిజన్ స్థాయి అధికారులు సభ్యులుగా, మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ సమావేశాలు నామమాత్రంగా మారిపోయాయి. తీసుకొన్న నిర్ణయాలు అమలు గాలికి వదిలేస్తున్నారు. కొన్ని సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పరిధిలోని కొండను 2000లో ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేకంగా టౌన్షిప్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కమిటీయే తీర్చాల్సి ఉంటుంది. దీనికోసం తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షించి చర్యలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గడచిన 11 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కమిటీ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోమవారం హార్సిలీహిల్స్‌లో పర్యటించనున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరముంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలివీ.. ►పొరుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలి. ►ఎంతో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ►రెవెన్యూ అతిథిగృహాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ►చెట్టుపై అతిథిగృహ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ►కొండపైనున్న బండరాళ్లు ఘాట్ రోడ్డుపై పడుతున్నాయి. ►రోప్‌వే మార్గంపై రీసర్వే అటకెక్కింది. ►రాత్రివేళ ఆరోగ్య సమస్య ఎదురైతే తలనొప్పికీ మాత్ర దొరకదు. విషసర్పాలు కాటేస్తే చావాల్సిందే. ►స్థానికంగా ఒక ఏఎన్ఎంను నియమించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ►పర్యాటకుల కోసం మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలి. ►మురికినీరు, వాడేసిన వ్యర్థాలు రోడ్లపై వేయకుండా తొట్టెలు, కాలువలు నిర్మించాలి. ►గాలిబండపై మందుబాబుల వీరంగాలు తగ్గడం లేదు. ►మద్యం సీసాలను పగులగొట్టడంతో గాజు పెంకులతో గాలిబండ భయానకంగా తయారైంది. ►వీధిలైట్లు పూర్తిగా వేయకపోవడంతో రాత్రివేళల్లో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. -
హార్సిలీహిల్స్ నిధులు వెనక్కు?
టెండర్లకే పరిమితమైన రూ.66లక్షల పనులు ఈ నెల 25లోగా పూర్తి చేయకుంటే కష్టమే? బి.కొత్తకోట: ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం నెలకొంది. కొండపై వివిధ అభివృద్ధి పనులు, అతిథిగృహాల నిర్మాణం కోసం రూ.66లక్షలు కేటాయించారు. వీటిని ఈనెల 25వ తేదీలోగా వినియోగించుకోలేని పరిస్థితి వస్తే నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు హార్సిలీహిల్స్‌లోని వృక్షాలపై అతిథిగృహాలను నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి రూ.16లక్షలు మంజూరు చేశారు. సాహస విన్యాసాల ప్రాంగణ సమీపంలోని రెండు మర్రి వృక్షాలపై ఒక్కో గదిని రూ.8లక్షలతో రెండు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపడంతో ఆ మేరకు నిధులు వచ్చాయి. ప్రారంభంలో నిర్మాణానికి ప్రయత్నాలు చేసిన అధికారులు తర్వాత దాని జోలికెళ్లలేదు. మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చుచేసే పరిస్థితి లేకపోవడంతో వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంది. రూ.50లక్షలతో మరిన్ని పనులు.. కొండపై రూ.50లక్షలతో పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. రూ.30లక్షలతో చిన్నపిల్లలు, పెద్దల సాహస విన్యాసాల క్రీడల ప్రాంగణం ఏర్పాటు, రూ.20లక్షలతో టెంట్‌హౌస్‌ల పునరుద్ధరణ, పాత వ్యూపాయింట్‌కు మరమ్మతులు, టైల్స్ వేయాలని నిర్ణయించారు. ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిర్మాణ, మరమ్మతు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా సాహస క్రీడలకు సంబంధించిన పనులు బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన సంస్థలే చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ పనులను ఈనెల 25వ తేదీలోగా పూర్తిచేయడం ఆసాధ్యం. దీనితో ఈ నిధులూ వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. -
హమ్మయ్య దాహం తీరింది!
హార్సిలీహిల్స్‌కు 2 కొత్త బోర్ల నుంచి ప్రారంభమైన పంపింగ్ బి.కొత్తకోట: మండలంలోని హర్సిలీహిల్స్లో రెండేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. ఇటీవల వేసిన 2 కొత్తబోర్ల నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత దాహం తీరినట్లయింది. ఆదివారం కొత్తబోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో నీటిని సంపులకు పంపింగ్ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సమ స్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. హార్సిలీ కొండకు 7 దశల్లో నీటిని కురబలకోట మండలం గాలేటివారిపల్లె నుంచి పం పింగ్ చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మాణం చేసిం ది. ఈ ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన 7 బోర్లున్నాయి. రెండేళ్లుగా ఆరు బోర్ల నుంచి నీటి పంపింగ్ లేకుండాపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రైతుల నుంచి నాలుగు బోర్లను లీజుకు తీసుకున్నారు. అయినా నీటి స మస్య తీరలేదు. నీటి సమస్య కారణంగా 10 అతిథి గృహాలను పర్యాటకులకు కేటాయించకుండా నిలిపివేయాల్సి వచ్చింది. రోజుకు లక్ష లీటర్ల కొరత తీరింది నిన్నటి వరకు హార్సిలీకొండకు రోజుకు లక్షల నీటి కొరత ఉండేది. ఆదివారం నుంచి ఆ కొరత నుంచి బయపడ్డారు. కొండపై రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంది. అయితే బోర్లు ఎండిపోవడంతో వేసవికి ముందు రోజుకు కేవలం 40 వేల లీటర్లు, ఇటీవల వరకు 25 వేల లీటర్ల నీళ్లే లభ్యమయ్యేది. ఈ నీరు పర్యాటక శాఖకే సరిపోకపోవడంతో స్థానికులకు, ఇతర శాఖలకు అం దించే వీలులేకపోయింది. ఒక ట్యాంకర్ నీటిని రూ.2 వేలతో కొనుగోలు చేశారు. పర్యాటక శాఖకు నీటినిల్వల కోసం నిర్మించిన 2.4 లక్షల లీటర్ల సామర్థ్యమున్న రెండు సంపులు ఎండిపోయాయి. ప్రస్తుతం కొత్తగా వేసిన 2 బోర్ల నుంచి నాలుగించుల నీళ్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రోజుకు లక్ష లీటర్ల నీటి లభ్యత మొదలైంది. అయితే లక్ష లీటర్ల వినియోగం తగ్గించి 80 వేల లీటర్లే పంపింగ్ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. సంపులకు నీటిని నింపేసి, మిగిలిన పంపింగ్ నీటిని అందరికీ సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారిన నీటి ధరలు కొండపై నీటి వినియోగంపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి లీటర్‌కు 3పైసలు ఉండగా 10పైసలు పెంచారు. గృహ అవసరాలకు వినియోగించే నీటికి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. పెరిగిన ఈ ధరతో పర్యాటక శాఖకు కొంతమేరకు ఆదాయం సమకూరనుంది. -
నిందితుల అరెస్టు
బి.కొత్తకోట: హార్సిలీహిల్స్‌కు వచ్చిన ఓ యువతి, యువకుడి ఫొటోలు తీసి బెదిరించిన కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం ఉదయం మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌లో అరెస్టు చేసినట్టు స్థానిక స్టేషన్‌హౌస్ ఆఫీసర్ మహాదేవ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈనెల 18న సోమల మండలానికి చెందిన కార్తీక్‌కుమార్ హార్సిలీహిల్స్‌కు వచ్చాడు. అదే సమయంలో మండలానికి చెందిన ఓ యువతి అక్కడకు రావడంతో ఒకరికొకరు మాట్లాడుకుంటూ గాలిబండ వద్ద కూర్చొన్నారు. వీరిని గమనించిన అటవీశాఖ అతిథిగృహ వాచర్ మనోహర్, అటవీ బీట్ ఆఫీసర్ కుమారుడు సుధాకర్, ఓ హోంగార్డు తమ్ముడు రియాజ్‌లు సెల్ఫోన్లో వారిద్దరి ఫొటోలు తీశారు. ఫొటోలను మీ కుటుంబీకులకు పంపుతామని బెదిరించి, వారి వద్దనున్న రూ.5 వేల నగదును లాక్కొన్నారు. ఇదీ చాలదని మరో రూ.5 వేలను డిమాండ్ చేశారు. మరుసటి రోజు చెల్లిస్తామని చెప్పడంతో వారి చిరునామాలు రాసుకొని వదిలేశారు. అక్కడి నుంచి వచ్చేసిన కార్తీక్‌కుమార్ మరుసటి రోజు 19వ తేదీ రూ.5 వేలు చెల్లించకపోవడంతో 20వ తేదీ నిందితులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వస్తే ఇస్తానని కార్తీక్‌కుమార్ చెప్పగా ఎన్టీఆర్ సర్కిల్‌కు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. ఈ విషయంలో నిందితులకు అనుమానం కలగడంతో ఎన్టీఆర్ సర్కిల్‌కు రాలేదు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులు ముగ్గురినీ మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌లో అరెస్టు చేశామని చెప్పారు. వీరిని మదనపల్లె కోర్టుకు తరలించామని చెప్పారు. కాగా నిందితులు తమకు ఇలా చేయడం అలవాటని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఈ సంఘటనతో హార్సిలీహిల్స్‌లో కలకలం రేగింది. పర్యాటకులు స్వేచ్ఛగా కొండకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పర్యాట కులు కోరుతున్నారు. -
హార్సిలీహిల్స్ భూమి లీజుకు గ్రీన్ సిగ్నల్ !
మూడెకరాలు పర్యాటక శాఖకు అప్పగించిన రెవెన్యూ ఎకరా విలువ రూ.40 లక్షల నుంచి రూ.6.6లక్షలకు కుదింపు {పారంభం కానున్న ప్రయివేటు కార్యకలాపాలు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఓ ప్రయివేటు సంస్థ హార్సిలీహిల్స్‌లో నిర్వహించతలపెట్టిన అడ్వంచర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణం కోసం భూమి లీజు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వె లువడిన క్రమంలో శుక్రవారం బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు ఆ భూమిని పర్యాటకశాఖకు అప్పగిం చారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను జాయిం ట్ కలెక్టర్‌కు అందజేశారు. హార్సిలీహిల్స్‌లో తొలి సారిగా ఇక ప్రయివేటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఏకైక వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ ప్రసిద్ధిచెందింది. అక్కడ సాహస విన్యాసాల ప్రాంగణం ఏర్పాటు కోసం ఓ సంస్థకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన మూడెకరాల స్థలాన్ని 2005లో ప్రభుత్వం కేటాయిం చేందుకు అనుమతినిచ్చింది. అప్పట్లో స్థలం స్వాధీనం చేసుకునే విషయంలో సంస్థ జాప్యం చేసింది. రెండేళ్లుగా దీనిపై దృష్టిపెట్టింది. స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై పూర్వ కలెక్టర్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఆ భూమికి విలువ నిర్ధారించే విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. చివరకు ప్రస్తుత కలెక్టర్ దీనిపై చర్యలు చేపట్టారు. భూమి అప్పగింతకు సంబంధించిన నివేదిక కలెక్టర్‌కు చేరగా, దాన్ని సీసీఎల్ఏకు పంపారు. అక్కడి నుంచి మార్చి 21న అనుమతులు మంజూరు కావడంతో బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొండజింకల పార్కు సమీపంలో సర్వే నంబర్ 592/1లోని 3 ఎకరాల భూమిని కేటాయించాలని నిశ్చయించారు. ఆ భూమిని రెవెన్యూ శాఖ నుంచి పర్యాటకశాఖకు బదిలీచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని పర్యాటకశాఖ అధికారులు లీజుదారులకు అప్పగించనున్నారు. దీనిపై శుక్రవారం జిల్లా పర్యాటకశాఖ అధికారి డీ.చంద్రమౌళిరెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ భూమిని తమకు అప్పగించార ని, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక భూమి అప్పగిస్తామని చెప్పారు. రూ.40 లక్షల నుంచి రూ.6.6 లక్షలకు హార్సిలీహిల్స్‌లోని భూమికి విలువను నిర్ణయించడంలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి భూమికి విలువకట్టలేం. అయితే ప్రయివేటు సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన భూమికి విలువ కట్టాల్సివచ్చింది. దీంతో తొలుత ఇక్కడ ఎకరా భూమికి ఏడాదికి రూ.5.5 లక్షలుగా నిర్ణయిం చి నివేదిక పంపారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కు పంపారు. తర్వా త ఎకరా విలువను రూ.40 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై కూడా అభ్యంతరాలొచ్చాయి. చివరకు ఎకరా కు రూ.6.6 లక్షలు చొప్పున మూడెకరాలకు రూ.19.8 లక్షలుగా నిర్ణయించారు. వచ్చేది మొక్కుబడి లీజు కొండపై పట్టుపరిశ్రమశాఖ భవనాల సమీపంలోని 3 ఎకరాలు లీజుకు అప్పగిస్తే ఏడాదికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆ భూమికి నిర్ణయించిన విలువలో 5 శాతమే. 3 ఎకరాల విలువ రూ.19.8లక్షలు. అంటే తొలిసంవత్సరం సంస్థ ప్రభుత్వానికి చెల్లించే లీజు రూ.99వేలు. రెండో ఏడాది ఈ మొత్తానికి అదనంగా మరో ఐదు శాతం కలిపి చెల్లిస్తారు. మూడో ఏడాది అభివృద్ధి రుసుము, లీజు మొత్తం కలిపితే రూ.2 లక్షలు ప్రభుత్వానికి అందుతుంది. ఇలా ఏడాదికేడాది పెరుగుతూ ఉంటుంది.