టెండర్లకే పరిమితమైన రూ.66లక్షల పనులు
ఈ నెల 25లోగా పూర్తి చేయకుంటే కష్టమే?
బి.కొత్తకోట: ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం నెలకొంది. కొండపై వివిధ అభివృద్ధి పనులు, అతిథిగృహాల నిర్మాణం కోసం రూ.66లక్షలు కేటాయించారు. వీటిని ఈనెల 25వ తేదీలోగా వినియోగించుకోలేని పరిస్థితి వస్తే నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు హార్సిలీహిల్స్‌లోని వృక్షాలపై అతిథిగృహాలను నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి రూ.16లక్షలు మంజూరు చేశారు. సాహస విన్యాసాల ప్రాంగణ సమీపంలోని రెండు మర్రి వృక్షాలపై ఒక్కో గదిని రూ.8లక్షలతో రెండు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపడంతో ఆ మేరకు నిధులు వచ్చాయి. ప్రారంభంలో నిర్మాణానికి ప్రయత్నాలు చేసిన అధికారులు తర్వాత దాని జోలికెళ్లలేదు. మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చుచేసే పరిస్థితి లేకపోవడంతో వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంది.
రూ.50లక్షలతో మరిన్ని పనులు..
కొండపై రూ.50లక్షలతో పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. రూ.30లక్షలతో చిన్నపిల్లలు, పెద్దల సాహస విన్యాసాల క్రీడల ప్రాంగణం ఏర్పాటు, రూ.20లక్షలతో టెంట్‌హౌస్‌ల పునరుద్ధరణ, పాత వ్యూపాయింట్‌కు మరమ్మతులు, టైల్స్ వేయాలని నిర్ణయించారు. ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిర్మాణ, మరమ్మతు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా సాహస క్రీడలకు సంబంధించిన పనులు బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన సంస్థలే చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ పనులను ఈనెల 25వ తేదీలోగా పూర్తిచేయడం ఆసాధ్యం. దీనితో ఈ నిధులూ వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది.
హార్సిలీహిల్స్ నిధులు వెనక్కు?
Published Sat, Mar 12 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement
Advertisement