ఒత్తిడి తగ్గించకపోగా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది!
నా వయసు 48 ఏళ్లు. రోజూ చాలా ఒత్తిడికి గురవుతుంటాను. చదువుకునే రోజుల్లో సరదాగా సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు రోజూ ఒత్తిడి తగ్గించుకోడానికి సిగరెట్లు కాలుస్తుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రోజూ దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్, ఆదిలాబాద్
సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకు సిగరెట్లు కాలుస్తుంటారని చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు.
గుండెపోటు వస్తే గుర్తించడమెలా?
నా వయస్సు 58 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఒకవేళ నిద్రలో ఆయాసం గాని, గుండెపోటు గాని వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపగలరు. - భాను ప్రసాద్, కర్నూలు
గుండెపోటును తొలిదశలోనే గుర్తిస్తే ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండెపోటు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతి నొప్పి లేదా ఛాతి మంటలన్నీ కచ్చితంగా గుండెపోటుకు సంబంధించినవి కాకపోవచ్చు. ఈసీజీ పరీక్ష చేయించుకోవడం వల్ల చాలారకాల గుండె సమస్యలకు మూలం తెలుస్తుంది. కాళ్లవాపు, ఆయాసం, కళ్లు తిరిగి పడిపోవడం, బరువులు ఎత్తుతున్నప్పుడు గుండె దడ రావడం గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలుగా భావించవచ్చు. నిద్రలో మీకు ఆయాసం వస్తే గుండె జబ్బు అని నిర్ధారించుకోవద్దు అలాంటి అపోహలతో ఆందోళన పడొద్దు.
చాలామంది స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆస్తమా కారణంగా నాలుగు మెట్లెక్కినా ఆయాసపడతారు. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు కాబట్టి గుండెపోటు వస్తే ఆయాసం ఉంటుందే తప్ప నొప్పి ఉండదు. ఇది గుండెనొప్పే కానీ, కాస్త భిన్నమైనది. గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా ఆయాసం వస్తుంది. అందుకే శ్వాస సమస్యలన్నీ గుండెనొప్పికి సంబంధించినవి కావు. వ్యాధి నిర్ధారణకు ఆయాసంతోపాటు ఇతర అంశాలు కూడా పరిశీలించాలి.
గుండెకు సంబంధించిన సమస్య కనిపించగానే మనం సత్వరం చేయాల్సినవి...
తొలి గంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా రోగిని ఆస్పత్రికి తరలించాలి. వెంటనే ఈసీజీ తీయించాలి.
డిస్ప్రిన్ కాని సార్బిట్రేట్ మాత్రలను వెంటనే నీటిలో కలిపి తాగించాలి.
కూర్చోబెట్టి గాని, పడుకోబెట్టి గాని ద్రావణాన్ని తాగించాలి. దీనితో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. డిస్ప్రిన్ మాత్ర స్ప్రెప్టోకైనేస్ ఇంజక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే దీనివల్ల రోగికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడు డిస్ప్రిన్ గాని సార్బిట్రేట్ మాత్రలను గాని దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం.