
మృతి చెందిన భూక్య మంగ్లీ
సాక్షి, తరిగొప్పుల: ఓటు వేసేందుకు వచ్చి బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండంలోని మాన్‌సింగ్ గ్రామ శివారు బాల్య భూక్యతండాకు చెందిన భూక్య మంగ్లీ (68) శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మండలంలోని అంకుషాపూర్‌లోని పోలింగ్ కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్ బయట బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్య చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచన మేరకు ఎంపీపీ నూకల కృష్ణమూర్తి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ముక్కెర బుచ్చిరాజ్, పోగుల మల్లేషం, నాగపూరి కిషన్ గౌడ్ ఉన్నారు.