సాక్షి, చెన్నై: ప్రభుత్వ పరంగా సాయం అందేలోపు..ఓ క్రీడాకారుడి శ్వాస ఆగింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని మండవర్ మంగళం గ్రామానికి చెందిన దురై పాండియన్, మల్లిక దంపతులకు మురుగేషన్, దినేష్ కుమారులు. గతంలో అనారోగ్యంతో దురై పాండియన్ మరణించాడు. అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో పనిచేసి పిల్లలను మల్లిక పోషించింది. పెద్దవాడైన మురుగేషన్ (20) తమిళనాడు రాష్ట్ర సబ్ జూనియర్ హాకీ టీం జట్టులో రాణించాడు.
ఇటీవల మురుగేషన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. అయితే ఆర్మీ ఎంపిక సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి మల్లిక కుమారుడికి అప్పు చేసి చికిత్స అందించింది. ప్రస్తుతం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన మురుగేషన్‌ను ఆదుకుని ఆధునిక వైద్యం అందించాలని ప్రభుత్వానికి కుటుంబీకులు, సహచర క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. అయితే సాయం అందేలోపు మురుగేషన్ మంగళవారం రాత్రి నిద్రలోనే మరణించాడు. బుధవారం తనయుడు ఇక లేరన్న సమాచారంతో మల్లిక శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment