
డస్ట్ మైట్స్‌తో ఆరోగ్యం దుమ్ము దుమ్ము!
అలర్జీస్
అలర్జీలతో బాధపడుతూ దానికి కారణమైన అంశాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఆ అలర్జీని కలిగించే అంశాల్లో ఒకటైన డస్ట్‌మైట్ ‘పక్కలో బల్లెం’లా మన పక్కనే ఉండవచ్చు. మన తలగడలోనే నివసిస్తూ ఉండవచ్చు. మన కార్పెట్‌లలో ఉండవచ్చు. అవి నేరుగా నీళ్లు తాగలేవు. అయితే వాటి మనుగడ కోసం నీరు కావాలి. అందుకే తమ ముందు కాళ్ల వద్ద ఉండే ఒక రకం గ్రంథుల ద్వారా వాతావరణంలోని తేమను స్వీకరిస్తుంటాయి. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉండవచ్చు.
ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్ ఉంటాయి. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని అనుకుంటారు. కానీ దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అందునా అవి విసర్జించే విసర్జకాల కారణంగా కూడా అలర్జీ కలుగుతుంటుంది. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.