మంచంపై పడుకొని ఉన్న వీరాటం గోపి, తల్లి మల్లేశ్వరి ఒడిలో గోపి
వయసు 13 ఏళ్లు...మనిషి 3 అడుగులు....ఆకలి అయితే తినాలనే ఆలోచన రాదు...మాట్లాడటానికి మాటలు రావు...తన మనస్సులోని భావాలను వ్యక్తపరచలేడు. తన అవసరాలను ఎదుటివారికి చెప్పేందుకు నోరు రాదు. ఆలోచించేందుకు మెదడు పరిణితిలేదు. ఏది కావాలన్నా కుటుంబ సభ్యులు తీర్చాల్సిందే. ఇటువంటి పరిస్థితిల్లో కుటుంబం అతనికి అండగా నిలబడింది. తల్లి, తండ్రి, అక్క వ్యవసాయ పనులు చేస్తూ, తమ కుటుంబాన్ని గడుపుతూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.. సమయం, డబ్బు వృథా అని వైద్యులు చెబుతున్నా.. ఏదో చిన్న ఆశ .. తమ బిడ్డ మామూలు మనిషి అవుతాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూసేలా చేస్తోంది.
పిడుగురాళ్ల రూరల్: మల్లేశ్వరి, లక్ష్మయ్యలకు మూడవ సంతానంగా వీరాటం గోపి జన్మించాడు. వారిది వ్యవసాయ కూలి కుటుంబం. నిరంతరం పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. కరవు ప్రాంతమైన బొల్లాపల్లి మండలం గుంమ్మనంపాడులో ఉండలేక అత్తగారి ఊరైన పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం గ్రామానికి వచ్చి 10 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నా తల్లి కాని, తండ్రి కాని గోపి దగ్గర ఉండి నిత్యావసరాలు తీర్చాల్సిందే. అక్క అనిత చిన్నతనం నుంచి పొలంపనులకు వెళ్తూ ఇంటి పోషణలో భాగస్వామ్యమవుతుంది. ఇంట్లో ముగ్గురు కూలి పని చేస్తూ, గోపి మందుల ఖర్చులు చూస్తూ, గోపి చిన్న అక్క రమ్యను చదివిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండలేక, గోపికి, ఇంటి పోషణకు వచ్చే డబ్బులు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. పందిటివారిపాలెం గ్రామంలో గోపిని చూసిన ప్రతి ఒక్కరు ఆ కుటుంబంపై జాలిచూపించాల్సిందే.
వైద్య సేవలకు వేలల్లో ఖర్చు...
మగ పిల్లాడు పుట్టాడని ఆనందించే లోపు ఎదుగుదల లేదని తెలిసి బాధపడిన తల్లిదండ్రులు వైద్యం చేయించేందుకు13 ఏళ్లుగా తిరగని ప్రదేశం అంటూ లేదు. గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖ హాస్పటల్స్‌లో మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ డాక్టర్లు మాత్రం గోపికిఅవయవాల ఎదుగుదల లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఏదో రకంగా గోపి మామూలు మనిషి అవుతాడని, ఏడాక్టర్ చేతిలో ఏముంటుందోనని ప్రతిడాక్టర్ సలహాలు, సూచనలు, మదులు వాడుతూనే వేల రూపాయలుఖర్చు చేస్తున్నారు. కానీ గోపిలో ఏలాంటి మార్పు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంఆదుకోవాలని వినతి
ప్రభుత్వ పింఛన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కానీ, గోపికి ఆధార్ తీసేందుకు వేలిముద్రలు కానీ, ఐరీష్ తీసేందుకు సహకరించటం లేదు. ఎన్నోసార్లు మీసేవాలో ఆధార్ నమోదు కోసం వెళ్లినా ఫలితంలేదు. దీంతో గోపి 10 ఏళ్లకు పైగా పింఛన్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈవిషయమై కుటుంబ సభ్యులు కలవని అధికారులు లేరు. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. పింఛన్ అయినా వస్తే కొంత ఉపశమనం కలుగుతుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment