
‘టాప్ అప్’ కావాలా? సూపర్ టాప్ అప్ కావాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్
రవికి 30 ఏళ్లు. ఆరోగ్య బీమా కవరేజీ రూ.2 లక్షల వరకు ఉంది. పాలసీ తీసుకొని కొన్నేళ్లు గడిచాక రవి ఒక విషయాన్ని గమనించాడు. రోజులతో పాటు వైద్య ఖర్చులూ పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తితే అప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ సరిపోదనే అంచనాకు వచ్చాడు. కొత్తగా మరొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాడు. వయసు ఎక్కువయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుందనే విషయం రవికి తెలుసు.
అప్పుడు కొత్తగా పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి కదా...! అన్నది అతడి ఆలోచన. ఈ సమయంలో రవికి తన స్నేహితుడు శంకర్ తారసపడ్డాడు. రవి ఈ విషయాన్ని శంకర్‌కు చెప్పాడు. అప్పుడు శంకర్.. రవికి హెల్త్ పాలసీలకు టాప్ అప్, సూపర్ టాప్ అప్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వీటి ద్వారా అదనపు కవరేజీ పొందొచ్చు. అవెలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం...
రవికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అతను టాప్ అప్ పాలసీల ద్వారా మరో రూ.5 లక్షల వరకు బీమా తీసుకున్నాడు. రవి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ చేరాడు. ఒక ఏడాదిలో నాలుగుసార్లు చేరటంతో 1.8 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం అంతటినీ బీమా కంపెనీయే భరించింది. కానీ అదే ఏడాది ఐదోసారి కూడా రవి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు బిల్లు ఏకంగా రూ.3 లక్షలయింది.
పాలసీలో కవరేజీ మొత్తం రూ.20 వేలే ఉన్నా... టాప్ అప్ రూ.5 లక్షల వరకు ఉండటంతో మిగిలిన రూ.2.8 లక్షలు కూడా బీమా కంపెనీయే భరించింది. కాకపోతే టాప్ అప్‌ను ఏడాదిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసే వీలుంటుంది. అది కూడా ... మన మామూలు బీమా కవరేజీ మొత్తం అయిపోతున్న సందర్భంలో... దానికన్నా ఎక్కువ ఎంత అవసరమైతే అంత, మన టాప్ అప్ పరిధిలో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
మరి సూపర్ టాప్ అప్ అంటే...!
సూపర్ టాప్ అప్ అంటే... టాప్ అప్ కన్నా కొంచెం ఎక్కువన్న మాట. టాప్ అప్‌ను ఏడాదిలో ఒకసారే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్ టాప్ అప్ అలా కాదు. దాని కవరేజీ మొత్తం పరిధిలో... ఏడాదిలో ఎన్నిసార్లయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రవినే తీసుకుందాం. రవి ఆ ఏడాది ఐదోసారి ఆసుపత్రిలో చేరటంతో కవరేజీ మొత్తం అయిపోయింది. టాప్ అప్ గనక ఒకసారి రూ.2.8 లక్షలు చెల్లించారు.
అదే రవి గనక సూపర్ టాప్ అప్‌ను రూ.5 లక్షలకు తీసుకుంటే... రూ.2.8 లక్షలు క్లెయిమ్ చేశాక కూడా ఇంకా కవరేజీ రూ.2.2 లక్షలుంటుంది. దాన్ని కూడా ఆ ఏడాది అవసరమైన పక్షంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పూర్తిగా రూ.5 లక్షలూ క్లెయిమ్ చేసుకునేదాకా ఇది వర్తిస్తుంది. కాకపోతే టాప్ అప్, లేదా సూపర్ టాప్ అప్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇవి బీమా కవరేజీకి అదనంగా పనిచేస్తాయి తప్ప ఇవే బీమా కవరేజీ కాదు. ఒక ఏడాదిలో లిమిట్ దాటిపోయిన పక్షంలో ఇవి అక్కరకు వస్తాయి. మన క్లెయిమ్ లిమిట్ పరిధిలోనే ఉంటే... వీటిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు.