![తీవ్రమైన తలనొప్పి, నడుమునొప్పి బాధిస్తున్నాయి!](/styles/webp/s3/article_images/2017/09/5/41486662844_625x300.jpg.webp?itok=Q45-gyLO)
తీవ్రమైన తలనొప్పి, నడుమునొప్పి బాధిస్తున్నాయి!
న్యూరో కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో పనులు చేసుకుని, పిల్లలను రెడీ చేసి, నా ఉద్యోగానికి వెళ్తాను. అయితే కొంతకాలం నుంచి నాకు నడుమునొప్పి, తలనొప్పితో పాటు తల తిరుగుతోంది. క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వాంతులు అవుతున్నాయి. ప్రయాణం వల్ల ఇలా జరుగుతోందేమో అనుకున్నాను. మా ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని టాబ్లెట్లు వాడాను. కానీ ఎలాంటి మార్పు లేదు. న్యూరో నిపుణుడిని కలవమని మా స్నేహితులు కొందరు సలహా ఇచ్చారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – ఒక సోదరి, హైదరాబాద్
మీరు చెబుతున్న తలనొప్పి, నడుమునొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముందుగా తలనొప్పి విషయానికి వస్తే... ఆహారం తినే వేళల్లో మార్పులు ఉన్నా, తినే వేళకు కాకుండా ఆలస్యంగా తింటూ ఉన్నా తలనొప్పి సమస్య తలెత్తుతుంది. అలాగే ఇంట్లో లేదా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు తలనొప్పి ఒకవైపు మాత్రమే వస్తుంటే అది మైగ్రేన్ కావచ్చు. సైనసైటిస్ వల్ల కూడా రావచ్చు. మీకు తలనొప్పి చాలాకాలం నుంచి ఉందా లేదా కొద్దికాలంగానే వస్తుందా అన్న విషయం మీ లేఖలో ప్రస్తావించలేదు. అయితే మీకు రెగ్యులర్‌గా వాంతులు కావడంతో పాటు కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, నీరసం, శరీరం నిస్సత్తువకు లోనుకావడం వంటి లక్షణాలకు గురవుతున్నారా అన్న విషయం ఒకసారి పరిశీలించుకోండి.
ఒకవేళ పైన తెలిపిన ఆరోగ్య సమస్యలతో మీరు సతమతమవుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, మీ లక్షణాలకు కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్షణం మీకు దగ్గర్లో ఉన్న న్యూనో ఫిజీషియన్‌ను కలవండి. మీ వైద్య పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్‌ను ఆధారంగా మీకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక మీ నడుము నొప్పి విషయానికి వస్తే... ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా పనిభారం ఎక్కువగా ఉండటం లేదా గంటల తరబడి ఒకే దగ్గర కదలకుండా, ఒకే భంగిమలో కూర్చొని ఉండటం (అంటే ఒంటి మీద ఒత్తిడి పడకుండా ఉండే ఆఫీస్ ఎర్గనమిక్స్ భంగిమలో కాకుండా తప్పుడు పద్ధతుల్లో కూర్చోవడం) వంటివి జరుగుతున్నప్పుడు నడుము నొప్పి రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చస్తే అది స్పాండిలోసిస్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ తలనొప్పి, నడుమునొప్పి విషయంలో వాస్తవ కారణాలన తెలుసుకొని, తగిన చికిత్స తీసుకునేందుకు వెంటనే న్యూరో నిపుణులను కలిసి, తగిన చికిత్స తీసుకొండి.
డా‘‘ఎస్. శ్రీకాంత్, న్యూరో సర్జన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్
మాదాపూర్, హైదరాబాద్