సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది.
1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు.
రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్లు తేలింది..
ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు
మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు.
ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment