
9 రాష్ట్రాల్లో ప్రాసెస్డ్ ఆహారమే వినియోగం
ఏపీలోని గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఆహారం వాడకం ఎక్కువ
దేశవ్యాప్తంగా గ్రామాల్లో దీనికోసం 20.93 శాతం వ్యయం
పట్టణాల్లో వ్యయం 27.95 శాతం
2023–24 గృహ వినియోగం సర్వే వెల్లడి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు తయారీ ఆహారం (ప్రాసెస్డ్ ఫుడ్)పైనే మక్కువ చూపుతున్నారు. వీటిపైనే అత్యధిక వ్యయం చేస్తున్నారు. ఈ విషయాన్ని 2023–24 గృహ వినియోగ సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఆహార వ్యయంలో 20.93 శాతం ప్రాసెస్ చేసిన ఆహారంపై వ్యయం చేస్తుంటే.. పట్టణ వాసులు ప్రాసెస్ ఆహారంపై 27.95 శాతం వ్యయం చేస్తున్నారు.
ఏపీలోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 20.07 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.72 శాతం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వినియోగిస్తున్నారు. గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో పాల ఉత్పత్తులపై గరిష్టంగా వినియోగిస్తున్నారు. కేరళలోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో గుడ్లు, చేపలు, మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.