
కాంట్రాక్టు వైద్య పోస్టుల భర్తీ షురూ
1,330 ఉద్యోగాలకు నోటిఫికేషన్
వచ్చే నెలాఖరుకు నియామకాలు
హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో 1,330 కాంట్రాక్టు వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టు తదితర పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని పదేళ్లు పెంచింది. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో ఐదేళ్లు వయోపరిమితిని సడలింపు వర్తిస్తుంది. మిలటరీలో పనిచేసిన వారికి సర్వీసుతో కలిపి మూడేళ్లు, వికలాంగులకు అదనంగా 10 ఏళ్లు వయోపరిమితి ఉంటుంది. ప్రతీ కేటగిరీలో రోస్టర్ పాయింట్లను లెక్కిస్తారు.
జిల్లాలకు మార్గదర్శకాలు: ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల్లో ఈ నెల 24 నుంచి 30 వరకు వీలునుబట్టి నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదేశిస్తూ... జిల్లాలకు ైవైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు పంపింది.
వచ్చే నెల 14 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 17నుంచి 22వరకు దరఖాస్తుల పరిశీలన, 19 నుంచి 24వరకు మెరిట్ జాబితాల ప్రదర్శన, 24 నుంచి 30 వరకు నియామకాలు జరుపుతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,330 పోస్టులను భర్తీ చేయనుం డగా...అందులో 630 మంది ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులు, 300 ఏఎన్‌ఎం, 300 ఫార్మసిస్టు పోస్టులు ఉన్నాయి. మిగతా 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్‌నర్సులు, సైకాలజిస్టు పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్‌కు రూ. 33 వేల వేతనం, ఆయుష్ మెడికల్ ఆఫీసర్‌కు రూ.22 వేలు, ఆగ్జిలరీ న ర్స్ మిడ్‌వైఫ్, ఫార్మసిస్టుకు రూ.10 వేలు, డెంటల్ మెడికల్ ఆ ఫీసర్‌కు రూ. 25 వేలు, స్టాఫ్‌నర్సుకు రూ. 14,190 వేతనంగా ఇస్తారు. చిన్న పిల్లల వైద్యులకు రూ. 80 వేల వేతనం ఇస్తారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో: జిల్లాస్థాయిలో భర్తీచేసే ఈ పోస్టులకు పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో సభ్య కన్వీనర్‌గా డీఎస్సీని ఏర్పాటు చేస్తారు. మరో ముగ్గురు సభ్యులుంటారు. ఈ కమిటీ జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మొత్తం 100 మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. పోస్టుకు అర్హతగల పరీక్షలో సాధించిన మార్కులను 90గా, వయసుకు గరిష్టంగా 10 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిభ ఆధారంగా జాబితా తయారుచేసి వెబ్‌సైట్‌లో పెడతారు. శిశువుల నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం... ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్‌ఎన్‌సీ)ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ బృందాలు ఉంటాయి. వీరు గుర్తించిన వ్యాధులున్న పిల్లలకు వైద్యం చేయడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. వాటిల్లో సేవలు అందించేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.