సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడికక్కడ చికిత్స అందించే అంశంపై సర్కారు దృష్టి సారించింది. కేన్సర్ నివారణ, పరీక్షలకు సంబంధించిన కార్యక్రమాలను వికేంద్రీకరించాలని భావిస్తోంది. ఆ విషయంపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) అధికారి మాధవిలతో కూడిన ఈ బృందంఅక్కడ కేన్సర్ కార్యక్రమాల వికేంద్రీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. రాష్ట్రంలో వాటి అమలుపై దృష్టిపెట్టింది.
రాష్ట్రంలో కేన్సర్ విస్తృతి..
తెలంగాణలో కేన్సర్ రోజురోజుకూ విస్తృతమవుతోంది. దీనిపై ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. నివారణకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఉన్నతస్థాయి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ లక్ష మంది జనాభాలో 74 కేన్సర్ కేసులున్నాయి. ఏటా 26 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.2 లక్షల మంది కేన్సర్‌తో బాధపడుతున్నారు. కేన్సర్లలో 25% సర్వైకల్, మరో 25% రొమ్ము, 40% పొగాకుతో వచ్చే గొంతు, ఊపిరి తిత్తులు వంటి కేన్సర్లు, 10% జీవనశైలిలో మార్పుల ద్వారా వచ్చే కేన్సర్లు, 5% జన్యుపరమైన కారణాల ద్వారా కేన్సర్లు వస్తుంటాయి. దేశంలో కేన్సర్ నివారణకు వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలను మున్ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం చేయనుంది.
జిల్లాస్థాయిలోనే కీమోథెరపీ
ప్రస్తుతం రాష్ట్రంలో కేన్సర్ స్క్రీనింగ్‌ను క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. అందులో బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ కేన్సర్లను ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. అటువంటి కేసులను హైదరాబాద్, వరంగల్‌లోని కేన్సర్ ప్రాంతీయ కేంద్రాలకు పంపుతున్నారు. అయితే వికేంద్రీకరణలో భాగంగా కేన్సర్ నిర్ధారణకు సంబంధించి మెడికల్ ఆఫీసర్లకు పూర్థిస్థాయిలో శిక్షణ ఇచ్చి అన్ని జిల్లాల్లో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడే పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే కేవలం స్క్రీనింగే కాకుండా జిల్లా స్థాయిలోనే కీమోథెరపీతోపాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు, చికిత్సలు కేన్సర్ రోగులకు అందించవచ్చా అన్న అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లా స్థాయిలో కేన్సర్ గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటిలోనే చికిత్సలు అందించడం, గుర్తించేందుకు సుశిక్షితులైన మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కేన్సర్ నిర్ధారించడం, ఇప్పటికే అందిస్తున్న పాలియేటివ్ కేర్ సేవలను కొనసాగించడం, భవిష్యత్‌లో ఈ సేవలన్నింటినీ మరింత విస్తరించడం లాంటివన్నీ కేన్సర్ కార్యక్రమాల వికేంద్రీకరణలో ఉండబోతున్నాయి. ఇండోర్‌లో అటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్న తీరును బృందం అధ్యయనం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment