జిల్లా కేంద్రాల్లో ‘పాలియేటివ్‌ కేర్‌’ యూనిట్లు | Medical Health Ministry Has Decided To Start Palliative Care Units In All Districts | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రాల్లో ‘పాలియేటివ్‌ కేర్‌’ యూనిట్లు

Published Sun, Nov 10 2019 2:34 AM | Last Updated on Sun, Nov 10 2019 2:34 AM

Medical Health Ministry Has Decided To Start Palliative Care Units In All Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్ని జిల్లాల్లో పాలియేటివ్‌ కేర్‌ యూనిట్లు ప్రారంభించా లని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 8 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవం తంగా నడుస్తుండటంతో, మిగతా అన్ని జిల్లాల్లోనూ నెలకొల్పేందుకు సన్నాహా లు ప్రారంభించింది. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కోరింది. ప్రస్తుతం ఆదిలాబాద్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్‌ (రూరల్‌), జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో పాలియేటివ్‌ కేర్‌ సేవలు ప్రయోగాత్మకంగా కొనసాగుతున్నాయి. జీవిత చరమాంకంలో ఉండే వయో వృద్ధులు, కేన్సర్‌కు గురై చివరి దశలో ఉన్నవాళ్లు తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్నే వైద్య పరిభాషలో ‘పాలియేటివ్‌ కేర్‌’గా పిలుస్తారు.

పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న వ్యవహా రం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామం ది అంతిమ దశలో బాధను అనుభవిస్తూ తనువు చాలిస్తారు. ఇలాంటి వారికి కావాల్సిన వైద్య సేవలు, మందులు ఇవ్వగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు. ఎన్‌హెచ్‌ఎం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి ఇంటికే వెళ్లి సేవలందించాలని కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్‌హెచ్‌ఎం అధికారి డాక్టర్‌ మాధవి తెలిపారు.  

జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య బృందం..
పాలియేటివ్‌ కేర్‌ కింద ఎంపికైన జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఓ వాహనాన్ని కేటాయిస్తారు. వైద్య బృందం రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి సేవలు చేయాల్సి ఉంటుంది. స్టాఫ్‌ నర్సులు, ఫిజియోథెరపిస్టులకు ఇప్పటికే ఆయా జిల్లాల్లో అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. త్వరలో జిల్లా ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు. నిమ్స్‌లోనూ వృద్ధుల కోసం (జెరియాట్రిక్‌) ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? అని ఆశ వర్కర్లు ఆరా తీస్తున్నారు. అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్‌ఎంలకు సమాచారమిస్తారు.

వారు రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్‌ కేర్‌’అవసరమా లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్‌ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్‌ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయా లన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం వెళ్లి సేవలు చేస్తుంది. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్‌ కేర్‌’వార్డుల్లో ఉంచి సపర్యలు చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement