
ఎన్‌హెచ్‌ఎంకు రూ. 1,571 కోట్లు ఇవ్వండి
కేంద్రానికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన
హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమాలకు అవసరమైన నిధులు కోరుతూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎన్‌హెచ్‌ఎం ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు రూ.1,571.10 కోట్లు కావాలని కోరుతూ నివేదిక పంపింది. గతేడాది తెలంగాణకు ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్రం రూ. 527.22 కోట్లు కేటాయించింది. దాంట్లో రూ.179 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఈసారి గతేడాది నిధులకు మూడు రెట్లు అదనంగా కోరడం గమనార్హం. ఇచ్చిన సొమ్ము ఖర్చు చేయడంలో విఫలం కావడంతో ఈసారి నిధుల విడుదల తక్కువగానే ఉంటుందని అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడం, శాఖలు విడిపోవడం, ఉద్యోగుల కేటాయింపులో ఆలస్యం తదితర కారణాల వల్ల విడుదల చేసిన నిధులు ఖర్చు చేయని మాట వాస్తవమేనని, ఆ పరిస్థితిని కేంద్రానికి విన్నవించినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ఆసుపత్రుల బలోపేతానికి రూ.127 కోట్లు..
ఎన్‌హెచ్‌ఎం కింద గ్రామీణ స్థాయిలో ఆసుపత్రుల బలోపేతానికి రూ. 127 కోట్లు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రాన్ని కోరింది. అందులో ప్రధానంగా మాతా శిశు సంరక్షణ విభాగాల ఏర్పాటు కూడా కీలకమైనవి. అయితే గతేడాది కేంద్రం వీటికోసం నిధులు కేటాయించలేదు. అలాగే పట్టణ ఆరోగ్య కార్యక్రమాలకు రూ. 221.88 కోట్లు కోరింది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే గతేడాది అందుకోసం రూ. 4.87 కోట్లు కేటాయిస్తే... ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోవడం గమనార్హం. అంధత్వ నివారణ కార్యక్రమం కింద రూ. 11.42 కోట్లు, జీతాలు, ఇతరత్రా మానవ వనరుల కోసం రూ. 153.96 కోట్లు కోరింది. గతంలో ఒక్కపైసా కేటాయించని జాతీయ వృద్ధుల ఆరోగ్య రక్షణ కార్యక్రమం కోసం ఈసారి మాత్రం రూ. 37 కోట్లు కావాలని ప్రతిపాదించింది. కేంద్రం నిధులు నిలిపివేసిన కేన్సర్, షుగర్, గుండె తదితర జబ్బుల నియంత్రణకు రూ. 82.13 కోట్లు కోరింది. సిబ్బంది శిక్షణ, నూతన నిర్మాణాలు తదితర ఖర్చులకు రూ. 85.22 కోట్లు కోరారు.