న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ కోవిడ్ 19 టీకా తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 60 ఏళ్లు పైబడిన వారందరూ, తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్యవారు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని, ఇందుకు వారంతా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోజరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారని మంత్రి జవదేకర్ చెప్పారు. ‘45 ఏళ్లు దాటిన వారందరూ టీకా తీసుకోండి. మొదటి డోసు టీకా తీసుకున్న తరువాత రెండో డోసును, వైద్యుల సలహా మేరకు 4 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవచ్చు’ అని అన్నారు.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంపై స్పందిస్తూ.. రాష్ట్రాలతో కేంద్రం మాట్లాడుతోందన్నారు. పంజాబ్‌లో నమోదైన కొత్త కేసుల్లో దాదాపు 80% మందిలో యూకే వేరియంట్ వైరస్‌ను గుర్తించారన్నారు. అందువల్ల, అర్హులైన అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీకా తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. అదే సమయంలో, మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం మొదలైన కోవిడ్ నిబంధనలను పాటించడం కొనసాగించాలన్నారు. భారత్‌లో ఇస్తున్న రెండు రకాల టీకాలు విజయవంతం కావడం గర్వకారణమని, ప్రధాని మోదీ కూడా కోవాక్జిన్ టీకా తీసుకున్నారని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం(నేషనల్ హెల్త్ మిషన్–ఎన్‌హెచ్‌ఎం) అమలును మంగళవారం కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన పలు పథకాల అమలును కేబినెట్ సమీక్షించింది.
మళ్లీ 40 వేలు...
కరోనా కేసులు రెండింతలు కావడానికి పట్టే సమయం ఈ నెల 23 నాటికి 504.4 రోజుల నుంచి 202.3కు పడిపోయింది. గత 24 గంటల్లో 40,715 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 199 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,166కు చేరుకుందని తెలిపింది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,45,377గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 2.96 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. ఇప్పటివరకూ 23,54,13,233 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం 9,67,459 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. గత 24 గంటల్లో బయట పడిన కేసుల్లో 80.90 శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట్రలో 24,645 (60.53శాతం), పంజాబ్‌లో 2,299, గుజరాత్‌లో 1,640 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో 75.15 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే ఉన్నాయి.
కొత్త వేరియంట్ కేసులు 795
దేశంలో కోవిడ్–19 విదేశీ వేరియంట్ కేసులు 795కు చేరుకున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ కేసులు ఈనెల 18వ తేదీన 400 మాత్రమే నమోదు కాగా, తాజాగా అవి 795కు పెరిగాయని పేర్కొంది. పంజాబ్‌లో బయటపడిన 401 కరోనా కేసుల్లో 81శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవేనని రాష్ట్ర సీఎం అమరీందర్ చెప్పారు.
ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలను పెంచండి
♦కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కోరిన కేంద్రం
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలనీ, టెస్ట్–ట్రాక్–ట్రీట్ ప్రొటోకాల్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలనీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ మేరకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మహమ్మారి బెడద నుంచి విజయవంతంగా బయటపడిన ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
►కొత్తగా బయటపడిన పాజిటివ్ కేసుల బాధితులను ఐసోలేషన్‌లో ఉంచడం లేదా క్వారంటైన్ చేయడం సాధ్యమైనంత త్వరగా చేపట్టి, సరైన చికిత్స అందించాలి. ఆర్‌టీ–పీసీఆర్ టెస్టులు తక్కువగా ఉన్న చోట నిర్దేశించిన పరీక్షల్లో 70 శాతం లేదా అంతకుమించి వేగంగా చేపట్టాలి.
►కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లా అధికారులు పాజిటివ్ కేసులు, వారి కాంటాక్టులను బట్టి కంటైన్‌మెంట్ జోన్లను జాగ్రత్తగా గుర్తించాలి.
►స్థానిక యంత్రాంగం వాస్తవ పరిస్థితులను అంచనా వేసి కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరాన్ని బట్టి జిల్లా, ఉప–జిల్లా, నగరం, వార్డు స్థాయిల్లో ఆంక్షలను అమలు చేయాలి.
►నిబంధనల అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థానిక జిల్లా, పోలీసు, మున్సిపల్ యంత్రాంగాలను జవాబుదారీగా చేయాలి.
►టీకా ప్రక్రియ ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా అమలు కావడం ఆందోళనకరమైన విషయం.
►ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి సంక్రమణను అరికట్టడం క్లిష్టమైన వ్యవహారం అయినందున అన్ని ప్రాధాన్య వయస్సుల వారికి వేగంగా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలి.
►రాష్ట్రాలతోపాటు, అంతర్రాష్ట్ర ప్రజల ప్రయాణాలు, సరుకు రవాణా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల ప్యాసింజర్ ట్రైన్లు, మెట్రో ట్రైన్లు, విమాన ప్రయాణాలతోపాటు పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు, వినోద పార్కులు, యోగా సెంటర్లు, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు, సభలు, సమావేశాలను ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ)అనుసరించి కొనసాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment