ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ గాంధీజీ విగ్రహం వద్ద ప్రతిపక్ష నేతల నిరసన
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్‌మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి.
ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్‌సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు.
పేదలను ఆదుకోలేరా?
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు.
డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం
దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్‌ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్‌సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు.
అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య
సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్‌పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment