నాణ్య‌మైన వైద్యం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం: మంత్రి విడదల రజిని | AP Health Minister Vidadala Rajini Meeting With NHM Department Officials | Sakshi
Sakshi News home page

నాణ్య‌మైన వైద్యం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం: మంత్రి విడదల రజిని

Published Thu, Jun 2 2022 7:22 PM | Last Updated on Thu, Jun 2 2022 7:22 PM

AP Health Minister Vidadala Rajini Meeting With NHM Department Officials - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ నాణ్య‌మైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డి ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో గురువారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఎన్‌హెచ్‌ఎం విభాగం ఉన్న‌తాధికారులు, క‌మిష‌న‌ర్ నివాస్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్‌.. వైద్య ఆరోగ్య‌శాఖ విష‌యంలో ఒక స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు.
చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి

ప్రజ‌లంద‌రికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసేందుకు జ‌గ‌న‌న్న ఏ మాత్రం వెనుకాడ‌టంలేద‌ని తెలిపారు. గ్రామ‌స్థాయి నుంచి మెడిక‌ల్ క‌ళాశాల‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల నిర్మాణం, ఆధునికీక‌ర‌ణ‌, వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వం ఏకంగా 16 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోందని చెప్పారు. 40 వేల‌కుపైగా నియామ‌కాలు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాల‌కు వైద్యం అందిస్తున్నామ‌న్నారు. ఈ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల స‌హాయ స‌హ‌కారాలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. 

నిర్ల‌క్ష్యం వీడితే చాలు
తాను ఈ మూడేళ్ల‌లో ప‌లు ఆస్ప‌త్రులు సంద‌ర్శించాన‌ని అన్ని చోట్లా మంచినీటి కొర‌త‌, అప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ‌లో లోపాలు, టాయిలెట్లు స‌రిగా లేక‌పోవ‌డం.. లాంటివి గ‌మ‌నిస్తూనే ఉన్నాన‌ని తెలిపారు. ఇవ‌న్న చాలా చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ని, అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఇవి పెద్ద‌విగా క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. స‌రైన స‌మ‌యంలో స్పందిస్తూ ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటే స‌రిపోతుంద‌ని, అధికారులు చిత్త‌శుద్ధితో ఉంటేనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన‌ ప‌నిచేస్తున్న వారంద‌రి సంక్షేమం గురించి కూడా మ‌నం ఆలోచించాల‌ని చెప్పారు. వారంద‌రికీ పీఎఫ్‌, ఈఎస్ఐ అందున్నాయో లేదో చూడాల‌న్నారు. ప్ర‌తి ఉద్యోగికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళ్లాల‌ని, ఏ ఒక్క‌రికి, ఎక్క‌డ స‌మ‌స్య ఎదురైనట్లు గుర్తించినా.. స‌ద‌రు ఏజెన్సీల‌పై చ‌ర్య‌ల‌కు వెనుకాడొద్ద‌ని చెప్పారు.

ఏఎన్‌ఎంలు, ఇత‌ర ఫీల్డ్ సిబ్బంది బ‌యోమెట్రిక్ విధానం వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప‌దే ప‌దే త‌న దృష్టికి తీసుకొస్తున్నార‌ని, వారి అభ్య‌ర్థ‌న‌లోనూ న్యాయం ఉంద‌ని, ప్ర‌త్యామ్యాయ ప‌ద్ధ‌తుల‌ను ఆలోచించాల‌ని ఆదేశించారు. 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎన్‌హెచ్ఎం ల‌క్ష్యాలు ఏమున్నాయి.. వాటిని ఎంత‌వ‌ర‌కు రీచ్ అయ్యాం.. ఇప్పుడు జ‌రుగుతున్న ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌నం ఎలా ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి అనే విష‌యాల‌పై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండాల‌ని చెప్పారు. ఆ మేర‌కు ప‌నిచేయాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు. ఎన్‌హచ్‌ఎం నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించుకోవడంలేద‌ని, మెడిక‌ల్ ఆఫీస‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని, ఏ ఆస్ప‌త్రిలోనూ ఇలాంటి ప‌రిస్థితులు ఉండ‌టానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్‌హెచ్‌ఎం నిధులను అంతా స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని చెప్పారు. 

కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నాం..
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తంలో ఏ ప్ర‌భుత్వాల‌కూ సాధ్యం కానంత‌గా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేస్తుంటే.. ఇప్ప‌టికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బ‌య‌ట‌కు రాస్తున్నార‌ని ఈ ప‌రిస్థితి మారాల‌ని చెప్పారు. ఎక్క‌డా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బ‌య‌ట‌కు రాయ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల‌కు కావాల్సిన అన్ని మెటీరియ‌ల్స్ అందించేందుకు ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంద‌ని, అయినా స‌రే కొన్ని ఆస్ప‌త్రుల్లో మెటీరియ‌ల్ కొర‌త క‌నిపిస్తోంద‌ని చెప్పారు. ఎలుక‌లు, దోమ‌లు ఆస్ప‌త్రుల్లో ఎందుకు ఉంటున్నాయ‌ని, ప్ర‌భుత్వ నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించి ఈ స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని సూచించారు. 

పీహెచ్ సీల్లో కాన్పులు జ‌రిగేలా చూడండి
రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తి పీహెచ్‌సీలో నెల‌కు క‌నీసం 10 కాన్పులైనా జ‌రిగేలా క‌చ్చితంగా ప్ర‌య‌త్నించాల్సిందేన‌ని చెప్పారు. ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల టీచింగ్‌, జిల్లా ఆస్ప‌త్రుల‌పై ఒత్తిడి పెరుగుతోంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని, నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని వివ‌రించారు. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న ప‌రిక‌రాల నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ని, నాణ్య‌త‌ను ప‌రిశీలించే టెక్నికల్ టీమ్‌లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాల‌ని సూచించారు.

కావాల్సినన్ని ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బందిని నియ‌మిస్తున్నాం, కోట్లాది రూపాయ‌ల‌తో పరిక‌రాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా స‌రే కొన్నిచోట్ల టెస్టులు బ‌య‌ట‌కు రాస్తున్నారు.. ఈ ప‌రిస్థితి మారాల‌ని మంత్రి తెలిపారు. ల్యాబ్‌ల‌లో ఉన్న వైద్య ప‌రిక‌రాల మెయింటినెన్స్‌కు సంబంధించి కాలిబ్రేష‌న్ స‌క్ర‌మంగా జ‌రుగుతోందా..? లేదా అని ప్ర‌శ్నించారు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ స్కీమ్ కింద కాలిబ్రేష‌న్ చేయాలని ఇది స‌క్ర‌మంగానే చేస్తున్నారా అని అడిగారు. వైద్య విభాగంలో ప్ర‌తి ఒక్క‌టి పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు. ప‌రికరాల నిర్వ‌హ‌ణ‌కు కూడా ప్ర‌భుత్వం బ‌డ్జెట్ కేటాయిస్తోంద‌ని, స‌మ‌స్య‌లు రాకుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని చెప్పారు. ఎల‌క్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్య శాఖ‌లో ప్రొఫెన‌ల్ ఐడీలు, ? ప్రైవేటు ఆస్ప‌త్రులు, ల్యాబ్‌లు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల మ్యాపింగ్ లాంటి వ‌న్నీ గ‌డువులోగా పూర్తికావాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆశ‌యాల‌కు, జ‌గ‌న‌న్న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం మనంద‌రిపై ఉంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఆయా విభాగాల ఉన్న‌తాధికారులంతా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement