సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పూర్తి నియంత్రణలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవియాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వివరించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మాండవియా శుక్రవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ గడిచిన రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో 267 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి విషయంలో సీఎం వైఎస్ జగన్ నిరంతరం వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేస్తున్నారని తెలియజేశారు.
రాష్ట్రానికి మరో 20 లక్షల బూస్టర్ డోసులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణ తదితర అవసరాలకు అయ్యే ఖర్చును నేషనల్ హెల్త్ మిషన్ భరించాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment