పల్లె క్లినిక్‌లు: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం | Central Govt Decided Government Clinics Will Be Set Up In Villages | Sakshi
Sakshi News home page

పల్లె క్లినిక్‌లు: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Published Thu, Feb 4 2021 3:17 AM | Last Updated on Thu, Feb 4 2021 9:17 AM

Central Govt Decided Government Clinics Will Be Set Up In Villages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అందులో తెలంగాణ నుంచి పలువురు సీనియర్‌ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలనే దశల వారీగా క్లినిక్‌లుగా మారుస్తారు. గతంలో వాటిని వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చాలని, వాటిల్లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంలో పలు మార్పులు చేశారు. ఎంబీబీఎస్‌ లేదా ఆయుర్వేద లేదా హోమియో లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. దీనిపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.  చదవండి: (తాగునీరు ఫ్రీ.. మే లేదా జూన్‌ నుంచి అమలు)

రెండు, మూడు ఊళ్లకొకటి...
ప్రస్తుతం పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) వైద్యానికి కీలకంగా ఉన్నాయి. మెడికల్‌ ఆఫీసర్, నర్సులు ఉండటంతో ప్రాథమిక వైద్యం అక్కడే అందుతుంది.అవి దాదాపు ఒక్కో మండలంలో ఒక్కోటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అయితే ఒక మండలంలో 15–20 గ్రామాలుంటే వారంతా పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తుంది. అలా 20–30 కిలోమీటర్లు  వెళ్తేగానీ కొన్ని గ్రామాలకు వైద్యం అందే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో పీహెచ్‌సీల కింద 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్‌ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడం వంటివి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా లేదా వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేసి వాటిల్లో వైద్య సేవలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్‌ లేదా ఒక పెద్ద గ్రామంలో ఒక క్లినిక్‌ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా క్లినిక్‌లలో రక్త పరీక్ష చేయడం, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించడం, వాటికి తగు వైద్యం అందించడంపై ఫోకస్‌ పెడతారు. దీంతో ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లపై ఆధారపడకుండా నాణ్యమైన వైద్యం రోగులకు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

వైద్య విద్య పూర్తయిన వారికి అవకాశం...
ప్రతీ ఏటా వేలాది మంది వైద్యులు మెడికల్‌ కాలేజీల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వారిలో కొందరు మెడికల్‌ పీజీలకు వెళ్తుండగా, కొందరు అత్యంత తక్కువగా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వేతనాలకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఏడాదికేడాదికి వీరి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఆయుష్‌ వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వీరందరికీ అవకాశం కల్పించాలన్నా, ప్రజలకు మరింత చేరువకు వైద్య సేవలు తీసుకురావాలన్నా ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా మార్చడం సరైందని కేంద్రం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ఎంబీబీఎస్‌ వైద్యులు, ఆయుష్‌ డాక్టర్లు ముందుకు రాకపోతే అటువంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను ఆయా క్లినిక్‌లలో నియమిస్తారు.

నర్సులకు మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదా ఇస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్‌ అర్హతగా నిర్ణయించారు. ఈ క్లినిక్‌లు పీహెచ్‌సీ పరిధిలో ఉంటాయి. ఇక్కడ నయం కాని జబ్బులను పీహెచ్‌సీకి పంపిస్తారు. డాక్టర్లను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే అవకాశం ఉంది. పారితోషికాన్ని ఎన్‌హెచ్‌ఎం ద్వారా ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయా క్లినిక్‌లలో పనిచేయాలన్న హామీపత్రం ఇవ్వాలన్న నియమం పెట్టే అవకాశం ఉంది. పైగా వీరు కొత్త క్లినిక్‌లున్న చోటే నివాసం ఉండాలన్న షరతూ విధిస్తారు. అప్పుడే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇంకా వీటిపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వస్తాయని చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement