రూ. 450 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

రూ. 450 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులకు బ్రేక్

Published Sat, Oct 15 2016 2:51 AM

రూ. 450 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులకు బ్రేక్

► ఈ ఏడాది నయాపైసా విడుదల చేయని కేంద్రం
► గతేడాది నిధులను సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్లకు బ్రేక్ పడింది. గతేడాది ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు కాకుం డా ఇతరత్రా తన ప్రాధాన్యాలకు వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అందుకే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.450 కోట్లు విడుదల చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఈ మేరకు కేంద్ర ఎన్‌హెచ్‌ఎం అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలకు నిధుల కటకట ఏర్పడింది.

ఆ పథకం కింద పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల వరకు కేటాయించింది. అందులో కేంద్రం వాటా రూ.450 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6నెలలు గడిచాయి. కానీ, కేంద్రం తన వాటాలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన సొమ్ములో ఇప్పటికీ రూ.300 కోట్లు తన వద్దే ఉంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇతరత్రా అవసరాలకు బదలాయించడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈ ఏడాది నిధులను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.

స్వయంగా జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో జన ని సురక్ష యోజన(జేఎస్‌వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్‌ఎస్‌కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందు లు, పరికరాల కొనుగోలుకు బ్రేక్ పడింది. పిల్లల టీకాలకు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడింది. ఎన్‌హెచ్‌ఎం కింద పనిచేసే 300 మంది డాక్టర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 5 వేల మంది ఏఎన్‌ఎంలు సహా ఇతరత్రా సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు రూ. 15 కోట్లు వేతనాల కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement