funds Break
-
ఏకగ్రీవ నజరానా ఏదీ
బషీరాబాద్: జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ డబ్బులు వస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని ప్రజాప్రతినిధులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మధ్య కుదిరిన అంగీకారం ప్రభుత్వానికి లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించింది. ఒక్కో జీపీలో ఎన్నికల నిర్వహణకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అయితే జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 71 జీపీలు సంపూర్ణంగా యునానిమస్ అయ్యాయి. మొత్తం 460 వార్డులు కూడా ఏకగ్రీవం సాధించాయి. తద్వారా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదా కావడంతో పాటు అభ్యర్థులకు ఖర్చు బెడద తప్పింది. అధికార పార్టీ చొరవ.. జిల్లాలోని 565 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు అన్ని అధికారాలు కట్టబెట్టడంతో ఆ పదవికోసం గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పంచాయతీ బరిలో మండల స్థాయి రాజకీయ నేతలతో పాటు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు వర్గాల వారు రంగంలోకి దిగడంతో ఎన్నికలు ఖరీదుగా మారాయి. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న పంచాయతీల్లో ఎలాగైన సర్పంచ్ పీఠం దక్కించుకోవాలని కొందరు అభ్యర్థులు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. మరీ ముఖ్యగా తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి పట్టణాలకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలు, గనుల ప్రాంతాల జీపీల్లో తీవ్ర పోటీ కొనసాగింది. ఇదిలా ఉండగా మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు రెబల్స్‌గా పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు.. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జిల్లాలోని 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కూడా చేరాయి. జిల్లాలో మొదటి విడతలో 34, రెండో విడతలో 18, తుది విడతలో 23 పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. 71 పంచాయతీలకే నజరానా జిల్లాలో మూడు విడతల్లో 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 71 పంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు మొత్తం పోటీలేకుండా గెలపుపొందారు. దీంతో వీటిని మాత్రమే సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలుగా గుర్తించిన ప్రభుత్వం.. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున పంచాయతీ ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు జీపీలకు ప్రోత్సాహక నిధులు అందలేదు. అభివృద్ధికి ఊతం.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10 లక్షల నజరానా అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఈ నిధులతో పాటు జెడ్పీ నుంచి మరో రూ.10 లక్షలు ఇస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తాండూరులో ప్రకటించారు. ఇలా మొత్తం రూ.20 లక్షల నిధులు ఏక కాలంలో పంచాయతీలకు అందితే వేగంగా అభివృద్ధి అవకాశం ఉంది. ఇటీవల ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏకగ్రీవ ప్రోత్సాహకం రాకపోవడంపై గ్రామ ప్రథమ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి కోసం ఏకమయ్యాం ప్రభుత్వం మా తండాను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. గతంలో ఉమ్మడి జీపీగా ఉన్నప్పుడు తండాలకు సర్పంచ్‌గా అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతా ఏకమయ్యాం. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో సర్పంచ్‌తో పాటు వార్డుల సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, జెడ్పీ నుంచి రూ.10 లక్షలు వస్తే ఊరిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – రవి, సర్పంచ్, కొత్లాపూర్(బి) -
డిపో ఎప్పుడో?
నర్సాపూర్: నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణం నత్తనడకన సా...గుతోంది. మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు చేపట్టిన వాటికి నిధులు విడుదల కానందునే సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడని సమాచారం. 20 ఏళ్లక్రితం డిపో ఏర్పాటుకు అప్పట్లో రవాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగింది లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. సీఎం కేసీఆర్ కావడంతో ఇక్కడ డిపో ఏర్పాటవుతుందని ప్రజలు ఆశించారు. ఈ మేరకు గత ఏడాది డిపో ఏర్పాటుకు ఒక రూపం వచ్చింది. గత ఏడాది మే 9న మెదక్‌లో జరిగిన సమావేశంలో నర్సాపూర్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నెలలో డిపో ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరయ్యాయి. జూన్‌లో టెండర్లు పూర్తి చేయగా జూలై 26న అప్పటి మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మ, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులతో కలిసి డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ డిపో నిర్మాణానికి హామీ ఇవ్వడంతో పాటు రూ.పది కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఆరు నెలల్లో డిపో నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని ప్రకటించారు. 26 బస్సులతో పాటు 150 మంది సిబ్బందిని నియమించి సేవలందిస్తామని హామీ ఇచ్చారు. పదకొండు నెలలు కావస్తున్నా .. మంత్రి ప్రకటించి 11 నెలలు కావస్తున్నా పనులు ఇంకా పునాది స్థాయిలో ఉండడం గమనార్హం. జూలైలో శంకుస్థాపన చేయగా ఆగస్టులో డిపో నిర్మాణ పనులు ప్రారంభించారు. షెడ్డు కోసం ఐరన్ రాడ్స్ ఫ్రేంలు ఏర్పాటు చేసినా వాటికి పైకప్పు వేసే పనులతో పాటు ఇతర పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరో భవన నిర్మాణం కోసం పునాదులు తీసి వదిలేశారు. ప్రహరీ నిర్మాణ పనులు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి. డిపో ఆవరణలో పెట్రోలుబంక్ ఏర్పాటు చేసి అద్దెకివ్వాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా బంకు నిర్మాణ పనులు హైదరాబాద్ రోడ్డును ఆనుకుని చేపట్టగా తుది దశకు చేరాయి. పెట్రోలు బంకు పనులు చివరి దశకు వచ్చినా డిపో పనులు మాత్రం ఇంకా పునాది స్థాయిలోనే ఉండడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కానందునే..? ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందునే డిపో నిర్మాణ పనులు ఆగాయని తెలిసింది. డిపో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండరు పూర్తి చేయడం, శంకుస్థాపన, నిర్మాణ పనులు చేపట్టడం వరుసగా పూర్తి చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత నిధులు విడుదల చేయనందునే పనులకు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.కోటి విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టరు చేపట్టగా అతనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందున పనులను ఆపి వేశాడని తెలిసింది. ఇప్పటికైనా డిపో నిర్మాణం విషయంలో అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
చెక్‌పవర్ ఏదీ?
పాపన్నపేట (మెదక్) : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉండాలి. కానీ పదవి చేపట్టి రెండు నెలలు గడిచినా చెక్ పవర్‌పై స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నిధులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు జనాభా ప్రాతిపదికన రూ.17,12,71,000 పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. నిధులు మంజూరైనా .. చెక్కుపై రెండో సంతకం ఎవరు పెట్టాలన్న విషయంపై ఇంతవరకు స్పష్టత లేక పోవడంతో చిక్కు వచ్చి పడింది. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. 2018 జూలై నాటికి పాత సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పట్లో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. జనవరి 2019లో గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. చెక్కుపై రెండో సంతకమే చిక్కు .. 2018 ఏప్రిల్ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలన్న నిబంధనలు పొందు పరిచారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త నిబంధన అమలు కాదని అదే నెలలో సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు ఎప్పటి మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోయినా పంచాయతీ నిధుల నుంచి రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్‌లు వాపోతున్నారు. నిధుల వరద.. తీయలేమనే బాధ ఈఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.17,12,71,000 మంజూరయ్యాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలుండగా 7,67,428 జనాభా ఉంది. ఒక్కొక్కరికి రూ.259 చొప్పున నిధులు సంబంధిత పంచాయతీ ఖాతాల్లో పడ్డాయి. ఈ మేరకు వీటి నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా, మోటార్ల కొనుగోలు, రిపేర్లు, వీధి దీపాల నిర్వాహణ, కొనుగోళ్లు, అంతర్గత రోడ్లు తదితర పనులు చేపట్టొచ్చు. ఎండలు మండుతుండడంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మురికి కాల్వలు, విద్యుత్ దీపాల ఏర్పాటు అత్యవసరం కావడంతో చాలామంది సర్పంచ్‌లు సొంతంగా ఖర్చు చేసి పనులు చేయించారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో 2018లో స్పెషల్ ఆఫీసర్లు పదవీ బాధ్యతలు చేపట్టగానే అదే సంవత్సరం ఆగస్టులో పంచాయతీరాజ్ కమిషనర్ ఒక ఉత్తర్వు ఇస్తూ.. ప్రత్యేక అధికారి, కార్యదర్శి సంతకాలను అనుమతించా లంటూ స్పష్టత ఇచ్చారని సర్పంచ్‌లు అంటున్నారు. ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అప్పటి లాగానే సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. గత మార్చి తోనే ఆర్థిక సంవత్సరం ముగిసినందున అప్పు చేసి పనులు చేసిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. స్పష్టత ఇవ్వాలి సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షల పనులు చేపట్టాం. చెక్కు వివాదంతో బిల్లులు రావడం లేదు. పంచాయతీరాజ్ శాఖ స్పందించి ఏదో ఒకటి తేల్చాలి. వేసవి కాలం కావడంతో తాగునీటి సరఫరాపై ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఇబ్బంది కలుగకుండా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. – పి.బాపురెడ్డి, సర్పంచ్, మల్లంపేట త్వరలోనే పరిష్కారం.. గ్రామ పంచాయతీ చెక్కుపై జాయింట్ పవర్ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. అందుకే బిల్లులు పాస్ కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏర్పడింది. దానికనుగుణంగా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. – హనూక్, జిల్లా పంచాయతీ అధికారి -
హే.. అల్లా
సాక్షి సిటీబ్యూరో: చారిత్రక మక్కా మసీదు పరిరక్షణలో నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతోంది. నిధుల విడుదలలో జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయలేమి శాంపంగా మారింది. సకాలంలో మరమ్మతు పనులు చేయకపోవడంతో మసీదు పైకప్పు నుంచి నీరు కారుతోంది. నీరు ప్రవేశించి మసీదు గోడలు బీటలు వారుతున్నాయి. దీంతో వర్షకాలంలో మసీదు పై నుంచి నీరు కారుతోంది. మసీదు కుడి వైపు ముందు భాగంలో రెండో నిజాం నుంచి ఆరో నిజాం వరకు సమాధులున్నాయి. ఈ సమాధులపై ఉన్న కప్పు శిథిలావస్థకు చెరుకుంది. కప్పు కూలే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులకు అటు వెళ్లకుండా బారికేట్లు పెట్టారు. రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిచడంతో అధికారులు స్పందించి మక్కా మసీదు మర్మమ్మతు పనులను 2017 ఆగస్టు 23న రూ. 8.48 కోట్లు నిధులు కేటాయించారు. నత్తనడకన పనులు.. 1694లో నిర్మాణం పూర్తి చేసుకున్న మక్కా మసీదు హైదరాబాద్ చరిత్రలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లామిక్ నిర్మాణశైలితో ఇరానీ అర్కిటెక్చర్ నైపుణ్యంతో నిర్మించారు. మసీదును ఆర్కియాలజీ శాఖ హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించింది. అయితే కాలక్రమేణా మసీదు దెబ్బతినడం ప్రారంభమైంది. పైకప్పు నుంచి నీరు లీకవ్వడం, పగుళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం మక్కా మసీదు పునరుద్ధరణ, సంరక్షణకు చర్యలు చేపట్టింది. రూ. 8.48 కోట్ల నిధులు కేటాయించింది. కానీ కేవలం రూ. 2 కోట్లు విడదల చేయడంతో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పురావస్తు శాఖ పర్యవేక్షణలో పనులు మక్కా మరమ్మతు పనులను వక్ఫ్ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు కొనసాగాయి. పురావస్తు శాఖ సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ నుంచి వర్కర్లను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. పనులను టెండర్ ద్వారా కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులను నిలిపి వేసినట్లు సమాచారం. శాఖల మధ్య సమన్వయ లోపం మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ద్వారా చెల్లిస్తోంది. అడపదడపా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని మరికొంత మంది నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించకుండా ప్రకటనలు చేస్తున్నారు. ఇరు శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతోనే పనుల్లో జాప్యం జరగుతుందని సమాచారం. ఇప్పటికైనా ఇరు శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసి మసీదు పనులు ఎప్పుడు పూర్తవుతాయే చెప్పాలని ఇటు పర్యాటకులు, ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. -
కాసుల్లేకే కదల్లేదు
సాక్షి, సిటీబ్యూరో: ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల పలువురు పార్లమెంట్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు మార్గాల్లో రెండో దశ పనులు ప్రారంభించగా ఒక్క లైన్ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే పనులు నత్తనడక నడుస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే పనుల్లో తీవ్ర జాప్యం నెలకొందని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ నేత దత్తాత్రేయ పేర్కొన్నారు. నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫలితంగా ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాజెక్టుల పురోగతిపైన మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైల్వే సదుపాయాలు మెరుగుపడాలని సూచించారు. నగరంలోని అనేక చోట్ల పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరగాలని కోరారు. మొదట్లో ఎంఎంటీఎస్ రెండోదశను రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే భావించాయి. నగర శివార్లను అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. మెట్రో రాక తరువాత ఈ ప్రాజెక్టు దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. రూ.817 కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం మూడొంతులు నిధులు భరించవలసి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్లే ఇచ్చారు. మరో రూ.336 కోట్లను అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అటు రైల్వేశాఖ నుంచి అందిన నిధులతో బొల్లారం–సికింద్రాబాద్, పటాన్చెరు–తెల్లాపూర్, మౌలాలీ–సనత్‌నగర్, తదితర మార్గాల్లో పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరిన్ని నిధులు లభిస్తే తప్ప ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లు పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఎంఎంటీఎస్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.200 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా రూ.300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, ఆ నిధులు వస్తే తప్ప రెండో దశ పూర్తి కాబోదన్నారు.‘ప్రభుత్వమే స్వయంగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడగించనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. మరోవైపు రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లనే రెండో దశలో జాప్యం నెలకొందని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్–బొల్లారం మధ్య రెండో దశ రైళ్లను వెంటనే పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల నాటి మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను పునరభివృద్ధి చేయాలని కోరారు. అలాగే మేడ్చల్ స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయడం వల్ల సికింద్రాబాద్‌పైన ఒత్తిడిని తగ్గించి మల్కాజిగిరి, మేడ్చల్ స్టేషన్లలో రైళ్లను నిలపవచ్చునన్నారు. వికారాబాద్, లింగంపల్లి వంటి రైల్వేస్టేషన్లలో ఎక్కువ రైళ్లను నిలపడం వల్ల శాటిలైట్ టౌన్స్ అభివృద్ధి చెందుతాయని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిధులుంటే రైళ్లొస్తాయి :జీఎం వినోద్‌కుమార్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులు తుది దశకు చేరుకున్నాయని, రాష్ట్రం నుంచి రావలసిన రూ.336 కోట్ల నిధులు లభిస్తే వెంటనే రైళ్లను అందుబాటులోకి తెస్తామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీల సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రైళ్ల కొనుగోలుకు నిధుల కొరత సమస్యగా నెలకొందన్నారు. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గాల్లో రెండో దశ రైళ్లను నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తే టెండర్లను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అప్పు చేసి మధ్యాహ్న భోజనం
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 698, ప్రాథమికోన్నత పాఠశాలలు 129, ఉన్నత పాఠశాలలు 186 ఉన్నాయి. వీటిలో లక్ష 20 వేల విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 420 మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. 100 మంది విద్యార్థులు దాటిన పాఠశాలలలో ఇద్దరు చొప్పున వర్కర్లు ఉంటారు. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా.. గుడ్లు, పండ్లు, ఇతర సరుకులను ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తర్వాత బిల్లులు చెల్లిస్తుంది. అయితే జిల్లాలో ఫిబ్రవరినుంచి బిల్లులు రావడం లేదు. రూ. కోటికిపైగా బకాయిలు జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకానికి సంబం ధించి ఏజెన్సీ నిర్వాహకులకు గత విద్యా సం వత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ బిల్లులు రావాల్సి ఉంది. ఒక్కో నిర్వాహకుడికి రూ. 40 వేల నుంచి రూ.లక్షకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ప్రతి ఏజెన్సి నిర్వాహకుడికి గౌ రవ వేతనంగా ప్రభుత్వం రూ. 1000 చెల్లిస్తోంది. జిల్లాలో 600 మందికిపైగా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఎనిమిది నెలలుగా గౌరవ వేతనం విడుదల కాలేదు. మధ్యాహ్న భోజన బిల్లులతోపాటు నిర్వాహకుల గౌరవ వేతనం బిల్లులు కలిపి కోటి రూపాయలకుపైగా రావాల్సి ఉంది. బిల్లులు రాకపోవడంతో అప్పులు చేయా ల్సి వస్తోందని భోజన ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. బిల్లులు వస్తలేవు.. నేను కామారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహిస్తున్నాను. ఫిబ్రవరి నుంచి బిల్లులు వస్తలేవు. గౌరవ వేతనం కూడా ఎనిమిది నెలలుగా ఇస్తలేరు. ఇబ్బందిగా ఉంది. విద్యార్థులకు భోజనం వండి పెట్టడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే బిల్లులు చెల్లించాలి. – నర్సింలు, ఏజెన్సీ నిర్వాహకుడు, కామారెడ్డి వారంలో చెల్లిస్తాం ప్రభుత్వం నుంచి ఇటీవలే బడ్జెట్ విడుదలైంది. అన్ని పాఠశాలల బిల్లులు సిద్ధం చేశాం. వారం రోజుల్లో బిల్లులను చెల్లిస్తాం. – రాజేశ్, ఇన్చార్జి డీఈవో, కామారెడ్డి -
రూ. 450 కోట్ల ఎన్హెచ్ఎం నిధులకు బ్రేక్
► ఈ ఏడాది నయాపైసా విడుదల చేయని కేంద్రం ► గతేడాది నిధులను సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్లకు బ్రేక్ పడింది. గతేడాది ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు కాకుం డా ఇతరత్రా తన ప్రాధాన్యాలకు వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అందుకే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.450 కోట్లు విడుదల చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఈ మేరకు కేంద్ర ఎన్హెచ్ఎం అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలకు నిధుల కటకట ఏర్పడింది. ఆ పథకం కింద పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల వరకు కేటాయించింది. అందులో కేంద్రం వాటా రూ.450 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6నెలలు గడిచాయి. కానీ, కేంద్రం తన వాటాలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన సొమ్ములో ఇప్పటికీ రూ.300 కోట్లు తన వద్దే ఉంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇతరత్రా అవసరాలకు బదలాయించడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈ ఏడాది నిధులను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. స్వయంగా జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో జన ని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందు లు, పరికరాల కొనుగోలుకు బ్రేక్ పడింది. పిల్లల టీకాలకు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడింది. ఎన్హెచ్ఎం కింద పనిచేసే 300 మంది డాక్టర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 5 వేల మంది ఏఎన్ఎంలు సహా ఇతరత్రా సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు రూ. 15 కోట్లు వేతనాల కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఇక అధికారులదే రాజ్యం!
మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి తెర కొనసాగనున్న కార్పొరేటర్ల హవా సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడంతో సర్కారు సుప్తచేతనావస్థలోకి జారుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి కత్తెర పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారి పరిస్థితి ‘కోమా’లో ఉన్నట్లే! ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారుల హవా సాగనుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన వల్ల స్థానిక సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండనందున.. కార్పొరేటర్లు ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు అధికారులు యథావిధిగా తమ పనులు తాము చేసుకోపోవచ్చున ంటున్నారు. మామూలుగా అయితే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవా ల వంటి కార్యక్రమాల కోసం ప్రొటోకాల్ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ఆనవాయితీ. రాష్ట్రపతి పాలన కొనసాగేంత వరకు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. అదే సమయంలో కార్పొరేటర్లకు ఇలాంటి పరిమితులేం లేవు. దీంతో ఇక తమ రాజ్యం సాగించుకోవచ్చునని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఓవైపు రాష్ట్రపతి పాలన.. మరో వైపు సార్వత్రిక ఎన్నికలకు అతి త్వరలో షెడ్యూలు వెలువడే అవకాశాలున్నందున పాలనలో అధికారులే ముఖ్య భూమిక వహించనున్నారు. ఇప్పుడున్న స్థితిలో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పనులు చేసుకుపోవచ్చునని కొందరు అధికారులు భావిస్తుండగా.. అడ్డూ అదుపూ లేకుండా చేతులారా సంపాదించుకునేందుకు కూడా ఇదే మంచి సమయమన్నది మరికొందరు అధికారుల యోచనగా ఉంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే.. స్టాండింగ్ కమిటీ సమావేశాలకు.. సదరు కమిటీ ద్వారా నిధుల మంజూరుకు బ్రేక్ పడనుంది. ఏ పనులు చేయాలనుకున్నా అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనలో కొందరుండగా.. ఒత్తిళ్లు లేకుండా, నిజంగా ప్రజలకుపకరించే పనులు చేయవచ్చునన్నది మరికొందరి యోచనగా ఉంది. గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలో పలు పనులు చేపట్టేందుకు భారీయెత్తున నిధులు మంజూరు చేశారు. కార్పొరేటర్లు పంతానికి పోయి నిధులు మంజూరు చేయించుకున్నారు. వాటిలో కొన్నింటికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. మరి కొన్నింటికి టెండర్లు పూర్తి కావాల్సి ఉంది. టెండర్లు పూర్తయినవాటికి వర్క్ ఆర్డర్లు ఇచ్చిన పనులను ప్రారంభించాల్సి ఉంది. వాటిలో కార్పొరేటర్లు పాల్గొనేందుకు అభ్యంతరాలుండవనేది అధికారులకు తెలిసినప్పటికీ.. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకు మరింత స్పష్టత కోసం జీహెచ్ఎంసీ పరిపాలన విభాగం నుంచి శనివారం గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో తమ సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా అందులో కోరారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేయవచ్చా..? ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ప్రారంభించవచ్చా..? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటివి జరపవచ్చా.. లేదా? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అభ్యంతరాల్లేనట్లయితే.. వాటిలో ఎవరెవరు పాల్గొనవచ్చు..? తదితర సందేహాలు నివృత్తి చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు. కాగా, రేపోమాపో ఎన్నిక ల నియమావళి అమల్లోకి వస్తే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగవని, అప్పుడిక సమస్యే ఉత్పన్నం కాదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.