- మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి తెర
- కొనసాగనున్న కార్పొరేటర్ల హవా
సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడంతో సర్కారు సుప్తచేతనావస్థలోకి జారుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి కత్తెర పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారి పరిస్థితి ‘కోమా’లో ఉన్నట్లే! ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారుల హవా సాగనుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన వల్ల స్థానిక సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండనందున.. కార్పొరేటర్లు ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు అధికారులు యథావిధిగా తమ పనులు తాము చేసుకోపోవచ్చున ంటున్నారు.
మామూలుగా అయితే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవా ల వంటి కార్యక్రమాల కోసం ప్రొటోకాల్ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ఆనవాయితీ. రాష్ట్రపతి పాలన కొనసాగేంత వరకు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. అదే సమయంలో కార్పొరేటర్లకు ఇలాంటి పరిమితులేం లేవు. దీంతో ఇక తమ రాజ్యం సాగించుకోవచ్చునని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఓవైపు రాష్ట్రపతి పాలన.. మరో వైపు సార్వత్రిక ఎన్నికలకు అతి త్వరలో షెడ్యూలు వెలువడే అవకాశాలున్నందున పాలనలో అధికారులే ముఖ్య భూమిక వహించనున్నారు.
ఇప్పుడున్న స్థితిలో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పనులు చేసుకుపోవచ్చునని కొందరు అధికారులు భావిస్తుండగా.. అడ్డూ అదుపూ లేకుండా చేతులారా సంపాదించుకునేందుకు కూడా ఇదే మంచి సమయమన్నది మరికొందరు అధికారుల యోచనగా ఉంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే.. స్టాండింగ్ కమిటీ సమావేశాలకు.. సదరు కమిటీ ద్వారా నిధుల మంజూరుకు బ్రేక్ పడనుంది. ఏ పనులు చేయాలనుకున్నా అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనలో కొందరుండగా.. ఒత్తిళ్లు లేకుండా, నిజంగా ప్రజలకుపకరించే పనులు చేయవచ్చునన్నది మరికొందరి యోచనగా ఉంది.
గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ
త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు పనులు చేపట్టేందుకు భారీయెత్తున నిధులు మంజూరు చేశారు. కార్పొరేటర్లు పంతానికి పోయి నిధులు మంజూరు చేయించుకున్నారు. వాటిలో కొన్నింటికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. మరి కొన్నింటికి టెండర్లు పూర్తి కావాల్సి ఉంది. టెండర్లు పూర్తయినవాటికి వర్క్ ఆర్డర్లు ఇచ్చిన పనులను ప్రారంభించాల్సి ఉంది. వాటిలో కార్పొరేటర్లు పాల్గొనేందుకు అభ్యంతరాలుండవనేది అధికారులకు తెలిసినప్పటికీ.. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకు మరింత స్పష్టత కోసం జీహెచ్‌ఎంసీ పరిపాలన విభాగం నుంచి శనివారం గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.
రాష్ట్రపతి పాలన నేపథ్యంలో తమ సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా అందులో కోరారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేయవచ్చా..? ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ప్రారంభించవచ్చా..? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటివి జరపవచ్చా.. లేదా? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అభ్యంతరాల్లేనట్లయితే.. వాటిలో ఎవరెవరు పాల్గొనవచ్చు..? తదితర సందేహాలు నివృత్తి చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు. కాగా, రేపోమాపో ఎన్నిక ల నియమావళి అమల్లోకి వస్తే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగవని, అప్పుడిక సమస్యే ఉత్పన్నం కాదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.