సాక్షి, సిటీబ్యూరో: ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల పలువురు పార్లమెంట్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు మార్గాల్లో రెండో దశ పనులు ప్రారంభించగా ఒక్క లైన్ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే పనులు నత్తనడక నడుస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే పనుల్లో తీవ్ర జాప్యం నెలకొందని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ నేత దత్తాత్రేయ పేర్కొన్నారు. నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫలితంగా ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని విస్మయం వ్యక్తం చేశారు.
వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాజెక్టుల పురోగతిపైన మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైల్వే సదుపాయాలు మెరుగుపడాలని సూచించారు. నగరంలోని అనేక చోట్ల పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరగాలని కోరారు. మొదట్లో ఎంఎంటీఎస్ రెండోదశను రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే భావించాయి. నగర శివార్లను అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. మెట్రో రాక తరువాత ఈ ప్రాజెక్టు దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. రూ.817 కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం మూడొంతులు నిధులు భరించవలసి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్లే ఇచ్చారు. మరో రూ.336 కోట్లను అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అటు రైల్వేశాఖ నుంచి అందిన నిధులతో బొల్లారం–సికింద్రాబాద్, పటాన్‌చెరు–తెల్లాపూర్, మౌలాలీ–సనత్‌నగర్, తదితర మార్గాల్లో పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరిన్ని నిధులు లభిస్తే తప్ప ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లు పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఎంఎంటీఎస్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ హయాంలో కేవలం రూ.200 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా రూ.300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, ఆ నిధులు వస్తే తప్ప రెండో దశ పూర్తి కాబోదన్నారు.‘ప్రభుత్వమే స్వయంగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడగించనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. మరోవైపు రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లనే రెండో దశలో జాప్యం నెలకొందని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్–బొల్లారం మధ్య రెండో దశ రైళ్లను వెంటనే పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల నాటి మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను పునరభివృద్ధి చేయాలని కోరారు. అలాగే మేడ్చల్ స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయడం వల్ల సికింద్రాబాద్‌పైన ఒత్తిడిని తగ్గించి మల్కాజిగిరి, మేడ్చల్ స్టేషన్‌లలో రైళ్లను నిలపవచ్చునన్నారు. వికారాబాద్, లింగంపల్లి వంటి రైల్వేస్టేషన్‌లలో ఎక్కువ రైళ్లను నిలపడం వల్ల శాటిలైట్ టౌన్స్ అభివృద్ధి చెందుతాయని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
నిధులుంటే రైళ్లొస్తాయి :జీఎం వినోద్‌కుమార్
ఎంఎంటీఎస్ రెండో దశ పనులు తుది దశకు చేరుకున్నాయని, రాష్ట్రం నుంచి రావలసిన రూ.336 కోట్ల నిధులు లభిస్తే వెంటనే రైళ్లను అందుబాటులోకి తెస్తామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీల సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రైళ్ల కొనుగోలుకు నిధుల కొరత సమస్యగా నెలకొందన్నారు. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్‌చెరు–తెల్లాపూర్ మార్గాల్లో రెండో దశ రైళ్లను నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తే టెండర్‌లను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment