MMTS-2
-
ఎంఎంటీఎస్–2 పరుగులు ఎప్పుడు?
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం – రైల్వే మధ్య వివాదం ముదురుతోంది. దీంతో ఎంఎంటీఎస్ రెండో దశలో మిగిలిన 20 శాతం పనులు ఎప్పటికి పూర్తవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగర ట్రాఫిక్‌ను కొంతమేర తగ్గించటంలో ఎంతో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు విస్తరణలో ఇంతకాలం ఇరుపక్షాల పట్టు విడుపులతో కొనసాగిన వ్యవహారం ఇప్పుడు పీటముడిగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తేనే ఆ పనులు ముందుకు తీసుకెళ్తామన్న తరహాలో రైల్వే శాఖ వ్యాఖ్యలు చేస్తుండటం దీనికి నిదర్శనం. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఎంతోకొంత నిధులు కేటాయిస్తూ వస్తున్న రైల్వే, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో దాన్ని పట్టించుకోలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేస్తే, మధ్యంతరంగా నిధులు కేటాయించుకోవచ్చన్న భావనతో ఉంది. అయితే ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో సైతం ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు కనిపించకపోవడం.. రైల్వే తాజా వైఖరికి కారణంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు రూ.130 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా సనత్‌నగర్–మౌలాలి, సికింద్రాబాద్–బొల్లారం, సికింద్రాబాద్–ఘట్కేసర్, లింగంపల్లి–తెల్లాపూర్, ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య లైన్ల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలే. దీన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రైల్వే.. సంయుక్త ప్రాజెక్టుగా పట్టాలెక్కించాలని ప్రతిపాదించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటంతో రూ.817 కోట్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో మూడింట రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం, ఒక వంతు రైల్వే భరించేలా ఒప్పందం కుదిరింది. ఆ లెక్కన రూ.270 కోట్లు రైల్వే ఖర్చు చేయాల్సి ఉంది. దాదాపు మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించి వేగంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కేటాయించింది. ఆ తర్వాత నిధుల రాక ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రైల్వే కినుక! అప్పటికే పనులు జరుగుతున్నందున తాను ఖర్చు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తం.. దాదాపు రూ.450 కోట్లు రైల్వే వ్యయం చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు లేఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది. అధికారులను కలసి చెప్పింది. కానీ నిధులు రాకపోవటంతో క్రమంగా పనుల్లో మందగమనం మొదలైంది. వాస్తవానికి ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. సనత్‌నగర్–మౌలాలి మధ్య 5 కి.మీ. రక్షణ శాఖ స్థలం విషయంలో స్పష్టత రాకపోవడంతో అంత మేర మినహా మిగతా పనులు పూర్తయ్యాయి. సికింద్రాబాద్–బొల్లారం పనులు దాదాపు పూర్తయ్యాయి. లింగంపల్లి–తెల్లాపూర్ మధ్య పనులు పూర్తి చేసి నైట్‌హాల్ట్ సర్వీసును కొంతకాలం నడిపింది. తాజాగా ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య ఎలక్ట్రిఫికేషన్‌ను కూడా రైల్వే పూర్తి చేసింది. ఒక్క ఘట్కేసర్ పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే ఎన్నిసార్లు కోరినా రాష్ట్రవాటా నిధులు రావటం లేదన్న ఉద్దేశంతో ఇక పనులు నిలిపివేయాలని రైల్వే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఖర్చు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వ్యయం చేసినందున, రాష్ట్రప్రభుత్వం నుంచి బకాయిలు వస్తేనే పనులు జరపాలని ఢిల్లీ నుంచి స్థానిక రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇంతకాలం ఈ విషయంలో పెద్దగా ప్రకటనలు చేయని స్థానిక జీఎం కూడా ఇటీవల రాష్ట్రం నుంచి నిధులు వస్తేనే ఈ పనులు పూర్తవుతాయంటూ బహిరంగ ప్రకటన చేశారు. తాజాగా రైల్వే శాఖ మంత్రి స్వయంగా పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇదే విధమైన సమాధానం చెప్పటంతో ఇక పనుల్లో ప్రతిష్టంభన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కొత్త మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభమైతే నగరంలో ట్రాఫిక్‌కు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. -
ఘట్కేసర్–మౌలాలి మధ్య ఫోర్‌లేన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటిగా ఉన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రెండో దశలో కీలక మార్గంలో కొంత భాగం అందుబాటులోకి వచ్చింది. సనత్‌నగర్–ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో పనులను చేర్చారు. ఘట్కేసర్ నుంచి మౌలాలి మీదుగా మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ, ఫిరోజ్‌గూడ, సుచిత్ర కూడలి, నేరెడ్మెట్ మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ మార్గం కొనసాగుతుంది.కీలకమైన ఘట్కేసర్–మౌలాలి మధ్య తాజా గా డబుల్ లేన్ నిర్మించారు. ఇప్పటికే ఆ మార్గంలో డబుల్ లేన్ ఉండగా, దానికి అదనంగా కొత్తగా రెండు వరసల మార్గం అందుబాటులోకి వచ్చింది. దానికి ఎలిక్ట్రిఫికేషన్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి కావటంతో సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ పచ్చజెండా ఊపటంతో బుధవారం నుంచి రైళ్లను నడుపుతున్నారు. మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు ఎంఎంటీఎస్ మార్గం పూర్తి కావాల్సి ఉన్నందున వాటిని నడిపేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం నిర్మించిన ఈ కొత్త డబుల్‌లేన్ మీదుగా రైళ్లు దూసుకెళ్లేందుకు కొంతకాలం నిరీక్షించక తప్పని దుస్థితి నెలకొంది. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు రూపుదిద్దుకున్న కొత్త డబుల్‌లేన్, అక్కడి నుంచి సనత్‌నగర్‌కు మళ్లాల్సి ఉంది. ఆ డైవర్షన్ మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా అమ్ముగూడ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. సనత్‌నగర్ మీదుగా సుచిత్ర, రామకృష్ణాపురం, నేరెడ్మెట్ మీదుగా ప్రస్తుతం సాగుతున్న ఆ సింగిల్లేన్ను కేవలం గూడ్సు రైళ్లు నడిపేందుకే పరిమితం చేశారు. దానిని అనుసంధానిస్తూ కొత్తగా డబుల్‌లేన్ రూపొందించాల్సి ఉంది. కానీ మధ్యలో కొంత భాగం రక్షణ శాఖ స్థలాలున్నాయి. వాటిని స్వాధీనం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎంతో ఊరట సికింద్రాబాద్–కాజీపేట ప్రధాన మార్గంలో ఉన్న ఘట్కేసర్–మౌలాలి స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త డబుల్ లేన్ ఇప్పుడు రైళ్ల రద్దీతో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఎంతో ఊరటనివ్వబోతోంది. సికింద్రాబాద్, కాజీపేట, నడికుడి (గుంటూరు), సనత్‌నగర్ (బైపాస్)లను అనుసంధానిస్తుంది. ఈ 12.2 కి.మీ. మేర రెండు వరసలతో ట్రాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చయింది. -
కాసుల్లేకే కదల్లేదు
సాక్షి, సిటీబ్యూరో: ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల పలువురు పార్లమెంట్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు మార్గాల్లో రెండో దశ పనులు ప్రారంభించగా ఒక్క లైన్ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే పనులు నత్తనడక నడుస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే పనుల్లో తీవ్ర జాప్యం నెలకొందని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ నేత దత్తాత్రేయ పేర్కొన్నారు. నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫలితంగా ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాజెక్టుల పురోగతిపైన మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైల్వే సదుపాయాలు మెరుగుపడాలని సూచించారు. నగరంలోని అనేక చోట్ల పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరగాలని కోరారు. మొదట్లో ఎంఎంటీఎస్ రెండోదశను రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే భావించాయి. నగర శివార్లను అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. మెట్రో రాక తరువాత ఈ ప్రాజెక్టు దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. రూ.817 కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం మూడొంతులు నిధులు భరించవలసి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్లే ఇచ్చారు. మరో రూ.336 కోట్లను అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అటు రైల్వేశాఖ నుంచి అందిన నిధులతో బొల్లారం–సికింద్రాబాద్, పటాన్చెరు–తెల్లాపూర్, మౌలాలీ–సనత్‌నగర్, తదితర మార్గాల్లో పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరిన్ని నిధులు లభిస్తే తప్ప ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లు పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఎంఎంటీఎస్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.200 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా రూ.300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, ఆ నిధులు వస్తే తప్ప రెండో దశ పూర్తి కాబోదన్నారు.‘ప్రభుత్వమే స్వయంగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడగించనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. మరోవైపు రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లనే రెండో దశలో జాప్యం నెలకొందని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్–బొల్లారం మధ్య రెండో దశ రైళ్లను వెంటనే పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల నాటి మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను పునరభివృద్ధి చేయాలని కోరారు. అలాగే మేడ్చల్ స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయడం వల్ల సికింద్రాబాద్‌పైన ఒత్తిడిని తగ్గించి మల్కాజిగిరి, మేడ్చల్ స్టేషన్లలో రైళ్లను నిలపవచ్చునన్నారు. వికారాబాద్, లింగంపల్లి వంటి రైల్వేస్టేషన్లలో ఎక్కువ రైళ్లను నిలపడం వల్ల శాటిలైట్ టౌన్స్ అభివృద్ధి చెందుతాయని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిధులుంటే రైళ్లొస్తాయి :జీఎం వినోద్‌కుమార్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులు తుది దశకు చేరుకున్నాయని, రాష్ట్రం నుంచి రావలసిన రూ.336 కోట్ల నిధులు లభిస్తే వెంటనే రైళ్లను అందుబాటులోకి తెస్తామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీల సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రైళ్ల కొనుగోలుకు నిధుల కొరత సమస్యగా నెలకొందన్నారు. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గాల్లో రెండో దశ రైళ్లను నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తే టెండర్లను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఎంఎంటీఎస్-2 పనులు పరిశీలించిన జీఎం
హైదరాబాద్: నగరంలో చేపడుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులను దక్షిణ మధ్య రైల్వేజీఎం వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. సికింద్రాబాద్-మౌలాలి-ఘట్కేసర్ మార్గంలో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.