డిపో ఎప్పుడో? | Medak Bus Depot Work Progress | Sakshi
Sakshi News home page

డిపో ఎప్పుడో?

Published Wed, Jun 19 2019 1:18 PM | Last Updated on Wed, Jun 19 2019 1:18 PM

Medak Bus Depot Work Progress - Sakshi

షెడ్డు ఏర్పాటు కోసం సిద్ధంగా ఉన్న ఐరన్‌ ఫ్రేంలు

 నర్సాపూర్‌: నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణం నత్తనడకన సా...గుతోంది. మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు చేపట్టిన వాటికి నిధులు విడుదల కానందునే సదరు కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశాడని సమాచారం. 20 ఏళ్లక్రితం డిపో ఏర్పాటుకు అప్పట్లో రవాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగింది లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. సీఎం కేసీఆర్‌ కావడంతో ఇక్కడ డిపో ఏర్పాటవుతుందని ప్రజలు ఆశించారు. ఈ మేరకు గత ఏడాది డిపో ఏర్పాటుకు ఒక రూపం వచ్చింది.

గత ఏడాది మే 9న మెదక్‌లో జరిగిన సమావేశంలో నర్సాపూర్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అదే నెలలో డిపో ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరయ్యాయి. జూన్‌లో టెండర్లు పూర్తి చేయగా జూలై 26న అప్పటి మంత్రులు   హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మ, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులతో కలిసి డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ డిపో నిర్మాణానికి హామీ ఇవ్వడంతో పాటు రూ.పది కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఆరు నెలల్లో డిపో నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని ప్రకటించారు. 26 బస్సులతో పాటు 150 మంది సిబ్బందిని నియమించి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.

పదకొండు నెలలు కావస్తున్నా ..
మంత్రి ప్రకటించి 11 నెలలు కావస్తున్నా పనులు ఇంకా పునాది స్థాయిలో ఉండడం గమనార్హం. జూలైలో శంకుస్థాపన చేయగా ఆగస్టులో డిపో నిర్మాణ పనులు ప్రారంభించారు. షెడ్డు కోసం ఐరన్‌ రాడ్స్‌ ఫ్రేంలు ఏర్పాటు చేసినా వాటికి పైకప్పు వేసే పనులతో పాటు ఇతర పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరో భవన నిర్మాణం కోసం పునాదులు తీసి వదిలేశారు. ప్రహరీ నిర్మాణ పనులు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి. డిపో ఆవరణలో పెట్రోలుబంక్‌ ఏర్పాటు చేసి అద్దెకివ్వాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా బంకు నిర్మాణ పనులు హైదరాబాద్‌ రోడ్డును ఆనుకుని చేపట్టగా తుది దశకు చేరాయి. పెట్రోలు బంకు పనులు చివరి దశకు వచ్చినా డిపో పనులు మాత్రం ఇంకా పునాది స్థాయిలోనే ఉండడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
 
నిధులు విడుదల కానందునే..?
ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందునే డిపో నిర్మాణ పనులు ఆగాయని తెలిసింది. డిపో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  పది కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండరు పూర్తి చేయడం, శంకుస్థాపన, నిర్మాణ పనులు చేపట్టడం వరుసగా పూర్తి చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత నిధులు విడుదల చేయనందునే పనులకు బ్రేక్‌ పడినట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.కోటి విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టరు చేపట్టగా అతనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందున పనులను ఆపి వేశాడని తెలిసింది. ఇప్పటికైనా డిపో నిర్మాణం విషయంలో అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement